కేంద్రానికి సీఎం విజయ్‌ రిక్వెస్ట్‌.. ఎందుకంటే? | Vijay Urges Centre To Scrap NEET-UG, Restore Medical Admissions Based On Class 12 Marks After Paper Leak Row | Sakshi
Sakshi News home page

కేంద్రానికి సీఎం విజయ్‌ రిక్వెస్ట్‌.. ఎందుకంటే?

May 13 2026 8:35 PM | Updated on May 14 2026 11:26 AM

Cancel Neet And Allow Class 12 Based Admission: Cm Vijay

చెన్నై: నీట్‌ను రద్దు చేసి 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ విజ్ఞప్తి చేశారు. నీట్-యూజీ (NEET-UG) 2026 రద్దు, పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షా విధానంలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ అంశంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు.

12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య విద్య ప్రవేశాలు కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల పేపర్ లీక్‌ జాతీయ స్థాయి పరీక్షా విధానంలోని లోపాలను బయటపెట్టిందని.. ఇది లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిందన్నారు. నీట్ పరీక్ష గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి, తమిళ మీడియం విద్యార్థులకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మే 3న జరిగిన నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సిబిఐ (CBI) విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా సిబిఐ ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పరీక్షల పారదర్శకతను పునరుద్ధరించడానికి ఎన్టీఏ స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన స్వయంప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రకారం.. సిక్కర్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి ద్వారా ఈ పేపర్ లీక్ మూలాలు కేరళ వరకు ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిణామాలన్నీ సుమారు 22 లక్షల మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement