జాతీయ నియామక సంస్థ ఏర్పాటు

Cabinet Approves Common Eligibility Test by NRA - Sakshi

ఇకపై విభిన్న నియామకాలకు కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 

గ్రూపు–బి, గ్రూపు–సి పోస్టులకు ఇది ప్రాథమిక పరీక్ష

కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో సంస్కరణలకు మార్గం సుగమం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌ జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఏ) గ్రూప్‌ బి, గ్రూప్‌ సి (నాన్‌–టెక్నికల్‌) పోస్టులకు అభ్యర్థులను పరీక్షించడానికి, షార్ట్‌లిస్ట్‌ చేయడానికి కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీఈటీ) నిర్వహిస్తుంది. ఎన్‌ఆర్‌ఏలో రైల్వే మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌కు చెందిన ప్రతినిధులు ఉంటారు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ పర్సనల్‌ (ఐబీపీఎస్‌) సంస్థలు ఇక వేర్వేరుగా నియామక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేకుండా.. ఎన్‌ఆర్‌ఏ ప్రిలిమినరీ స్థాయి పరీక్షగా కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీఈటీ) నిర్వహించి స్కోరు కేటాయిస్తుంది. కేంద్రం ఈ జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) కోసం రూ.1,517.57 కోట్లు ఖర్చు చేయనుంది. 117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షాకేంద్రాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులను వెచ్చిస్తారు.  

ఇవీ ప్రయోజనాలు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు వివిధ పోస్టుల కోసం బహుళ నియామక సంస్థలు నిర్వహించే విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. బహుళ నియామక సంస్థలకు ఫీజులు చెల్లించాల్సి రావడం, వివిధ పరీక్షల్లో హాజరు కావడానికి చాలా దూరం ప్రయాణించాల్సి రావడం, ఆయా పరీక్షలు అభ్యర్థులపై, అలాగే సంబంధిత నియామక ఏజెన్సీలపై ఆర్థిక భారం మోపుతుండడం, సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, వేదిక లభ్యత వంటి అనేక సమస్యలు ప్రస్తుత విధానంలో ఉత్పన్నమవుతున్నాయి.

సగటున 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతారు. వీటన్నింటికీ పరిష్కారంగా ప్రిలిమినరీ పరీక్షగా ఒక సాధారణ అర్హత పరీక్ష నిర్వహించడం ద్వారా అభ్యర్థులు ఒకే సారి హాజరు కావడానికి, అలాగే తదుపరి దశలో ఉన్నత స్థాయి పరీక్ష కోసం ఈ నియామక ఏజెన్సీలలో ఏదైనా లేదా అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను చేరువ చేస్తుంది.

117 ఆకాంక్ష జిల్లాల్లో పరీక్షా మౌలిక సదుపాయాలను సృష్టించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం సాధ్యం అవుతుంది. దూర ప్రాంతాలలో నివసించే గ్రామీణ అభ్యర్థులను పరీక్ష రాయడానికి ప్రేరేపిస్తుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది. పరీక్ష ఫీజుతో పాటు, అభ్యర్థులు ప్రయాణం, బోర్డింగ్, బస వంటి వాటి కోసం అదనపు ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఒకే పరీక్ష అభ్యర్థులపై ఆర్థిక భారాన్ని పెద్ద ఎత్తున తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా అభ్యర్థులు రవాణా, బస లభ్యతలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారు సహాయకులను వెంట తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ అవస్థలు కూడా కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీఈటీ) ద్వారా తగ్గనున్నాయి.  

కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ముఖ్యాంశాలు..
► ఎన్‌ఆర్‌ఏ కింద ఒక పరీక్షలో హాజరు కావడం ద్వారా అభ్యర్థులు అనేక పోస్టులకు పోటీపడే అవకాశం లభిస్తుంది. ఎన్‌ఆర్‌ఏ ప్రిలిమినరీ (మొదటి–స్థాయి / టైర్‌ 1) పరీక్షను నిర్వహిస్తుంది, ఇది అనేక ఇతర ఎంపికలకు మెట్టుగా మారుతుంది.  
► కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టును ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.  
► ఫలితం ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి అభ్యర్థి యొక్క సీఈటీ స్కోరు చెల్లుతుంది. స్కోరు మెరుగుపర్చుకోవడం కోసం పరీక్ష మళ్లీ రాసుకోవచ్చు. ఉన్న స్కోర్లలో అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
► గరిçష్ట వయోపరిమితి లోపు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.  
► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు గరిష్ట వయోపరిమితి ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు లోబడి ఉంటుంది.  
►  ప్రిలిమినరీ టెస్ట్‌లో వచ్చే స్కోరు అధారంగా ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ సంస్థలు తమ నియామకాల కోసం అవసరమైన సందర్భాల్లో తదుపరి దశల్లో పరీక్ష నిర్వహిస్తాయి.
► కంప్యూటర్‌ ఆధారిత సీఈటీని మూడు కేటగిరీల్లో నిర్వహిస్తారు. పట్టభద్రులు, 12వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులకు వేర్వేరు కేటగిరీలుగా ఈ పరీక్ష ఉంటుంది.
► పరీక్షలకు ఉమ్మడి పాఠ్య ప్రణాళిక ఉంటుంది.  
► మల్టిపుల్‌ చాయిస్‌ ఆబెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
► అభ్యర్థులు ఒక పోర్టల్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని సెంటర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. హాల్‌ టికెట్లు, మార్కులు, మెరిట్‌ లిస్టు... అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.
► విభిన్న భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.  
► సీఈటీ స్కోరు ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ ఏజెన్సీలకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని ఏజెన్సీలు కూడా ఈ సీఈటీ స్కోరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుని రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటాయని కేంద్రం ఆశిస్తోంది.  
► సెట్‌ ఆధారంగా జరిగి ప్రాథమిక వడపోతతో అనేక నియామక ప్రక్రియలు వేగవంతంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.  

యువతకు ప్రయోజనకరం: ప్రధాని
జాతీయ నియామక సంస్థ ఏర్పాటు దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రయోజనకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బహుళ పరీక్షలను తొలగించి, విలువైన సమయాన్ని, వనరులను ఆదా చేస్తుందని పేర్కొన్నారు. దీని మూలంగా పారదర్శకత పెరుగుతుందన్నారు. ఎంతో డబ్బును, సమయాన్ని ఆదా చేసే కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టును ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top