బెంగాల్‌ టైగర్‌ బీజేపీ | BJP win in West Bengal Assembly Elections | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ టైగర్‌ బీజేపీ

May 5 2026 5:59 AM | Updated on May 5 2026 5:59 AM

BJP win in West Bengal Assembly Elections

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం  

293 స్థానాలకు గాను 206 స్థానాలు కైవసం  

బెంగాల్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీ సర్కార్‌  

1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం  

81 స్థానాలకు పరిమితమైన తృణమూల్‌ కాంగ్రెస్‌  

భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి  

కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లు, ఏజేయూపీకి 2 సీట్లు, సీపీఎం, ఏఐఎస్‌ఎఫ్‌కు చెరొకటి... ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్‌  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ‘పరివర్తన్‌’కే ప్రజ లు ఓటేశారు. మార్పునకు పట్టంగట్టారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే ‘డబుల్‌ ఇంజన్‌’ప్రభుత్వం రావాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపును గౌరవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకే విజయం కట్టబెట్టారు. చరిత్రాత్మక తీర్పు ఇచ్చా రు. అంగ, కళింగ రాజ్యాలను ఇప్పటికే కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఎట్టకేలకు తన లక్ష్యాన్ని చేరుకుంది. తూర్పు భారతదేశంలోని వంగ రా జ్యాన్ని సైతం జయించింది. మొట్టమొదటిసారిగా బెంగాల్‌లో జయకేతనం ఎగురవేసింది. దీదీ కోట ను బద్దలుకొట్టి బెంగాల్‌ టైగర్‌గా అవతరించింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 293 స్థానాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, ఏకంగా 206 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.  

టీఎంసీకి కోలుకోలేని నష్టం  
ప్రాంతాలు, జనాభా స్థితిగతులకు అతీతంగా అన్నిచోట్లా ప్రభంజనం సృష్టించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కంచుకోటల్లోకి సైతం బీజేపీ చొచ్చుకెళ్లింది. ప్రభుత్వ పాలన మాత్రమే కాకుండా బెంగాల్‌ రాజకీయ ముఖచిత్రంలో నిర్మాణాత్మక మార్పును ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత మమతా బెనర్జీ తన ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మరోసారి పరాజయం పాలయ్యారు. ఈసారి అసెంబ్లీ స్థానం మాత్రమే మారింది, ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. 2021లో ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోగా, ప్రస్తుతం భవానీపూర్‌లో చేదు అనుభవం చవిచూశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు కోలుకోలేని నష్టం జరిగింది. ఆ పార్టీ 81 స్థానాలకే పరిమితమైంది. 100కుపైగాసీట్లను లూటీ చేశారంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. సీపీఎం 1, ఇతరులు మరో మూడు సీట్లు గెల్చుకున్నారు. ఒక నియోజకవర్గంలో ఈనెల 21న రీపోలింగ్‌ జరుగనుంది.  

54 ఏళ్ల తర్వాత డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌  
బెంగాల్‌ చరిత్రలో 1972 తర్వాత తొలిసారిగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రాన్ని పరిపాలించబోతోంది. 54 ఏళ్ల తర్వాత డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావడం గమనార్హం. బెంగాల్‌లో తమ పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ప్రజా తీర్పును ప్రశంసించారు. రాష్ట్రంలో కమలం వికసించిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బీజేపీ కృషి చేస్తుందని ప్రకటించారు. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి మోదీయే కేంద్రబిందువుగా నిలిచారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బూత్‌స్థాయి నెట్‌వర్క్, అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాలను సమన్వయం చేస్తూ ముఖ్య వ్యూహకర్తగా వ్యవహరించారు. బీజేపీ ఆధిక్యం ఉత్తర బెంగాల్‌ నుంచి జంగల్‌మహల్, దక్షిణ బెంగాల్‌ వరకు, సరిహద్దు జిల్లాల నుంచి పారిశ్రామిక ప్రాంతాల వరకూ విస్తరించింది.

రాష్ట్రమంతటా ప్రభంజనం సృష్టించింది. నగరాలు, పట్టణాల్లోనే కాకుండా గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటింది. 2021 నాటి ఎన్నికల్లో 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 45 శాతానికిపైగా ఓట్లు చేజిక్కించుకుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓట్ల శాతం 48 శాతం నుంచి 40.94 శాతానికి పడిపోయింది. బీజేపీకి ఉత్తర బెంగాల్‌లో గట్టి పట్టుంది. ప్రస్తుతం దక్షిణ ప్రాంతంలోనూ మంచి ఫలితాలు సాధించింది. రాజధాని కోల్‌కతా సహా హౌరా, హూగ్లీ జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించింది.

బ్రాత్య బసు, మానస్‌ రంజన్‌ భూనియా, శశి పంజా, చంద్రిమా భట్టాచార్య సహా 20 మంది మంత్రులు ఓటమిపాలయ్యారు. ఈ తీర్పు బీజేపీకి ఒక కీలక మలుపు. 1990వ దశకం వరకు బెంగాల్‌లో నామమాత్రంగా ఉన్న ఆ పార్టీ అధికార పీఠం అధిరోహించే స్థాయికి చేరింది. తన చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల పాలనను చూసిన ప్రజలు ఇకపై బీజేపీ పాలనకు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement