కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయం అందుకుంది. అయితే, ఫలితాల అనంతరం, బెంగాల్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్ధరాత్రి తృణముల్ కాంగ్రెస్ యూనియన్ ఆఫీసుకు బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఉద్రికత్తలకు దారి తీసింది. దీంతో, బెంగాల్‌లో బుల్డోజర్ల అంశం చర్చనీయాంశంగా మారింది.
వివరాల మేరకు.. బెంగాల్‌లోని చారిత్రక హాగ్ మార్కెట్ (న్యూ మార్కెట్) ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ఈ వ్యాపార కేంద్రంలో బుల్డోజర్ల గర్జన మొదలైంది. బుల్డోజర్లతో వచ్చిన ఓ గుంపు టీఎంసీ యూనియన్ కార్యాలయాన్ని కూల్చివేశారు. టీఎంసీకి చెందిన న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీసు ఈ ఘటనలో పూర్తిగా నేలమట్టమైంది. దీంతో భయాందోళనకు గురైన వ్యాపారులు తమ షాపులను మూసేసి పరుగులు తీశారు.
అయితే, బుల్డోజర్ కూల్చివేతపై టీఎంసీ నేతలు సంచలన విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై టీఎంసీ నేతలు స్పందిస్తూ.. ఇదే బీజేపీ అసలు రూపం. బీజేపీ ఎన్నికల నినాదమైన ‘పరివర్తన్’ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. కోల్‌కతాలోని చారిత్రక న్యూ మార్కెట్.. బెంగాలీలు ఈ పరివర్తనాన్ని ఆస్వాదిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఈ కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర బలగాలు (CAPF) అక్కడ చూస్తుండగానే, బీజేపీ విజయోత్సవాల్లో భాగంగా మాంసం దుకాణాలను కూల్చడానికి బుల్డోజర్లను తీసుకొచ్చారు అంటూ ఆరోపించారు. బెంగాల్‌లో ఈ ‘బుల్డోజర్ రాజకీయాలను’ అడ్డుకుంటామని నేతలు స్పష్టం చేశారు.
Bulldozers are rolling across West Bengal
BJP is clearing West Bengal by demolishing illegal TMC party offices and shops in the New Market area pic.twitter.com/bHqlrjWa4X— Surajit (@surajit_ghosh2) May 5, 2026
అనంతరం, పార్టీ ఆఫీసు కూల్చివేతపై టీఎంసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్బంగా టీఎంసీ..‘ఇది బీజేపీ మద్దతుదారుల గూండాయిజం, వ్యాపార సంస్థలను టార్గెట్ చేసుకుని హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. బీజేపీ అగ్రనేతల అండదండలతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చింది. అయితే, ఈ ఆరోపణలను స్థానిక నివాసితులు, కొందరు వ్యాపారులు తోసిపుచ్చారు. కూల్చివేసిన నిర్మాణం అక్రమంగా నిర్మించినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కూల్చివేతల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఏది ఏమైనా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండో రోజే బెంగాల్‌లో ఇలా బుల్డోజర్లు బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


