నా కారే ఆపుతావా? నేనెవరో తెలుసా?.. రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కుమార్తె

BJP MLA Daughter Jumps Signal In BMW Allegedly Misbehaves With Cops - Sakshi

బెంగళూరు: ట్రాఫిక్‌లో సిగ్నల్‌ జంప్‌ చేయడమే కాకుండా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించింది ఓ యువతి. నా కారునే ఆపుతావా, నేనెవరో తెలుసా అంటూ పోలీసుపై కస్సుబుస్సుమంటూ మండిపడింది. తప్పు చేసి తప్పించుకోవడమే కాకుండా పోలీసులపై ఫైర్‌ అయిన ఆ యువతి ఓ ప్రజా ప్రతినిధి కుమార్తె అవ్వడం మరో విశేషం. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు తన బీఎండబ్ల్యూ కారు డ్రైవ్‌ చేస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఓచోట రెడ్‌ సిగ్నల్‌ పడినా ఆగకుండా రయ్‌మంటూ దూసుకెళ్లింది. 

ఇది తెలిసిన ట్రాఫిక్‌ పోలీస్‌ ఆమె కారును ట్రేస్‌ చేసి రాజ్‌భవన్‌ రోడ్డు వద్ద ఆపారు. కారును పోలీసులు అడ్డుకోవడంతో చిర్రెత్తిన ఎమ్మెల్యే కుమార్తె నా కారే ఆపుతావా అంటూ పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ‘నేనే ఎవరో తెలుసా.  నేను ఇప్పుడు వెళ్లాలి.​ నా కారును ఆపోద్దు. ఓవర్‌టేక్ చేసినందుకు నాపై కేసు పెట్టలేవు. ఇది ఎమ్మెల్యే వాహనం. మా నాన్న అరవింద్ లింబావలీ’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతోనూ గొడవ పడింది. దీంతో రాజ్‌భవన్‌ వద్ద జనాలు గుమిగూడటంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.

కాగా యువతి సీట్‌ బెల్టుకూడా పెట్టుకోలేదని తెలిసింది. అయితే ఆమె మాటలు పట్టించుకొని పోలీసులు యువతికి జరిమానా విధించారు అలాగే బీఎండబ్ల్యూ కారు నెంబర్‌పై చలాన్లు పరిశీలించగా పోలీసులు ఖంగుతున్నారు. ఆమె వాహనంపై 9 వేల రూపాయల చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక ప్రస్తుతం ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ చేసినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీంతో మొత్తం 10 వేలను ఆమె ఉంచి పోలీసులు రాబట్టారు. 

కాగా దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీయగా.. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమార్తె తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దుర్భాషలాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కుమార్తె చర్యలను సదరు ఎమ్మెల్యే సమర్ధించుకోవడం గమనార్హం. కూతురు ఏ తప్పు చేయలేదని, ఇలాంటి ఘటనలు రోజూ వేలాదిగా జరుగుతాయన్నారు. జర్నలిస్ట్‌ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు వస్తున్న ఆరోపణలను సైతం ఆయన తోసిపుచ్చారు.  అయితే ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో ఎట్టకేలకు తన కూతురు తరపున బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ క్షమాపణలు కోరారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులతో అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top