బెంగాల్‌లో పట్టుదలతో పైకి ఎదిగిన బీజేపీ
సున్నా సీట్ల నుంచి ప్రస్థానం ఆరంభం
1982 నుంచి ఎన్నికల్లో పోటీ
2016లో తొలిసారిగా అసెంబ్లీలోకి ప్రవేశం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి అధికార స్థానానికి ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకమే. బీజేపీ మాతృసంస్థ అయిన భారతీయ జనసంఘ్‌ను బెంగాలీ బాబూ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 1951లో భారతీయ జనసంఘ్ పురుడు పోసుకుంది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఉనికిలోకి వచ్చింది. 1980వ దశకంలో బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసిరాలేదు. 1982 అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 1.29 లక్షల ఓట్లు వచ్చాయి. సీట్లేవీ రాలేదు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో పోటీచేసి, 1.01 లక్షల ఓట్లు సాధించింది. 1987లో 57 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగింది. 1.34 లక్షల ఓట్లు దక్కించుకుంది.
1989 లోక్‌సభ ఎన్నికల్లో 19 సీట్లలో పోటీకి దిగి 5.29 లక్షల ఓట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో పరాజయాలు తప్పలేదు. బెంగాల్ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న బీజేపీ కోరిక దశాబ్దాలపాటు నెరవేరలేదు. అప్పట్లో వామపక్షాలు అత్యంత బలంగా ఉండడం కాషాయ పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారింది. అయితే, ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ రావడం బీజేపీకి ఊరటనిచ్చింది. ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ ఆ పార్టీ ఏనాడూ నిరాశ చెందలేదు. పట్టుదలతో పోరాడుతూ పైకి ఎదిగింది.
ప్రతి ఎన్నికలోనూ పెరిగిన ఓట్ల శాతం
1990వ దశకంలో రామజన్మభూమి ఉద్యమం బెంగాల్‌లో ఆ పార్టీకి మంచి ఊపునిచ్చింది. 1998లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ తొలిసారిగా ఒక స్థానాన్ని గెల్చుకుంది. 37.24 వేల ఓట్లు లభించాయి. 1999లో తృణమూల్ కాంగ్రెస్‌తో జట్టుకట్టి 13 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి, రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. 39.28 లక్షల ఓట్లు వచ్చాయి. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో 266 స్థానాల్లో పోటికి దిగింది.
సీట్లు రాకున్నా 19.01 లక్షల ఓట్లు సాధించింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 291 సీట్లలో పోటీచేసి, తొలిసారిగా మూడు స్థానాలు గెల్చుకొని పెను సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి బీజేపీకి ఎదుగుదలకు అడ్డే లేకుండాపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 293 సీట్లలో పోటీకి దిగి, 2.89 కోట్ల ఓట్లు సాధించి, 77 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. మొదటిసారిగా రెండో అతిపెద్ద పార్టీగా మారింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఐదేళ్లలోనే ఏకంగా అధికార పీఠం దక్కించుకుంది.


