డెహ్రాడూన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ధామి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ కార్యదర్శి ధీరజ్ సింగ్ గర్బ్యాల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ ఈ ప్రత్యేక విచారణ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నేషనల్ హెల్త్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ తివారీ, వైద్య-ఆరోగ్య సేవల ఫైనాన్స్ డైరెక్టర్ జగత్ సింగ్ చౌహాన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ రాబోయే 15 రోజుల్లోగా ఆలయ నిధుల లెక్కింపు, రికార్డులను సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా తీసుకోవాల్సిన పారదర్శక చర్యలపై కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.


