అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌ విక్టరీ | Assam: BJP Hattrick Victory | Sakshi
Sakshi News home page

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌ విక్టరీ

May 5 2026 8:54 AM | Updated on May 5 2026 9:05 AM

Assam: BJP Hattrick Victory

గువాహటి: రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న కమలదళానికి అస్సాం ఓటర్లు మరోసారి పట్టంకట్టారు. దశాబ్దకాలంగా సవ్యంగా పరిపాలన సాగిస్తున్న బీజేపీయే మరో సారి తమను పరిపాలించాలని అస్సాం ఓటర్లు ఖాయం చేసుకున్నారు. 

సోమవారం అస్సాం శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని తన అధికారాన్ని పదిలపర్చుకుంది. అస్సాంలో బీజేపీకి ఇది హ్యాట్రిక్‌ విజయం. కాంగ్రెస్‌ను వీడి కమలతీర్థం పుచ్చుకున్ననాటి నుంచి అహర్నిశలు పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర దిగ్గజనేత హిమంత బిశ్వ శర్మకు అస్సామీలు మరోసారి జైకొట్టారు. అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు ఏప్రిల్‌ 9వ తేదీన ఒకే దఫాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 82 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 19 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమి పార్టీ అయిన బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌) 10 చోట్ల గెల్చింది. అసోం గణ పరిషద్‌ 10 చోట్ల విజయం సాధించింది. ఏఐయూడీఎఫ్, రాయ్‌జోర్‌ దళ్‌ పార్టీలు చెరో రెండు స్థానాల్లో గెలిచాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఒకే ఒక్క నియోజకవర్గంలో నెగ్గింది. 

మహిళా మంత్రి అజంతా నియోగ్‌ మొదలు పిజూశ్‌ హజారికా, రనోజ్‌ పెగూ దాకా హిమంత కేబినెట్‌ మంత్రుల్లో చాలా మంది గెలిచారు. జలుక్‌బారీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మహిళా అభ్యర్థి బిదిషా నియోగ్‌ కంటే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వేల ఓట్లు అధికంగా సాధించి గెలుపుబావుటా రెపరెపలాడించారు. జలుక్‌బారీ నుంచి హిమంత వరసగా ఆరో సారి విజయం సాధించడం విశేషం. పాతికేళ్లుగా జలుక్‌బారీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హిమంత 2001లో ఇక్కడ తొలివిజయం రుచిచూశారు. 

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు బై చెప్పి కమలదళంలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ మాజీ మంత్రి ప్రద్యూత్‌ బోర్డోలాయ్‌ సైతం దిస్పూర్‌ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి మీరా బోర్‌ఠాకూర్‌ గోస్వామి కంటే ప్రద్యూత్‌ 49,667 ఓట్లు ఎక్కువ సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అగ్రనేత గౌరవ్‌ గొగోయ్‌ జొర్హాట్‌ స్థానంలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్‌ గోస్వామి చేతిలో గొగోయ్‌ ఓడిపోయారు. జాగిరోడ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి íపీయూష్‌ హజారికా సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీ బుబుల్‌ దాస్‌పై ఏకంగా 93,584 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జాగిరోడ్‌లో హజారికాకు ఇది వరసగా నాలుగోవిజయం. ఎన్‌డీ ఏ కూటమి పార్టీ అసోం గణ పరిషద్‌ అధ్యక్షుడు అతుల్‌ బోరా సోమవారం బోకాఖాట్‌లో రాయ్‌ జోర్‌ దళ్‌ అభ్యర్థి హరిప్రసాద్‌ సైకియాపై 60,537 ఓట్ల మెజారీ్టతో గెలిచారు. బిన్నాఖండీలో అస్సాం జాతీయ పరిషద్‌ అభ్యర్థి రీజౌల్‌ కరీం చౌదరి కంటే ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఏఐయూడీఎఫ్‌) నేత మొహమ్మద్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ 35 వేల ఓట్ల మెజారీ్టతో విజయం సాధించారు. 

సంబరాల్లో మునిగిన శ్రేణులు 
పార్టీ హ్యాట్రిక్‌ విజయం సాధించిందన్న వార్త తెల్సి రాష్ట్రంలో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గువాహటిలో అస్సాం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(వాజ్‌పేయీభవన్‌) వద్ద పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. బీజేపీ కార్యాలయం బయట వైష్ణవభక్తి ఉద్యమ కళాకారులు నగర సంకీర్తన చేశారు. కార్యకర్తలు హిమంతకు అనుకూలంగా నినాదాలుచేశారు. భారత్‌మాతాకీ జై అని నినదించారు. 

పార్టీ ఘనవిజయంపై అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ సైకియా సంతోషం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిన కారణంగానే ఓటర్లు మళ్లీ తమకే అధికారం కట్టబెట్టారు. రాష్ట్రంలో 55 ఏళ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనను మా పదేళ్ల అద్భుత పాలనతో పోల్చుకుని చివరకు మావైపే ఓటర్లు నిలబడ్డారు’’అని సైకియా విశ్లేíÙంచారు. ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి హిమంత ప్రజలకు అనుకూలంగా చేపట్టిన పథకాలతో ఈ విజయం సాధ్యమైంది. ఈ గెలుపు ముమ్మాటికీ ప్రజలదే. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఇవి నిజమైన ఆనందభాష్పాలు’’అని బీజేపీ అధికార ప్రతినిధి మిటానాథ్‌ బోరా ఏడుస్తూ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement