బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించిన గవర్నర్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం
హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
బెంగాల్‌లో తొలి బీజేపీ సీఎంగా రికార్డుకెక్కనున్న సువేందు అధికారి
చొరబాట్లు లేని బెంగాల్, బంగారు బెంగాల్ స్వప్నాన్ని సాకారం చేస్తాం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన
రాష్ట్రంలో భయం పోయింది, భరోసా వచ్చింది
సువేందు అధికారి స్పష్టీకరణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఉత్కంఠ వీడిపోయింది. సీనియర్ నేత సువేందు అధికారికే అధికారం అప్పగించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బెంగాల్‌లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం కోల్‌కతాలో సమావేశమయ్యారు. సువేందును శుక్రవారం పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. నూతన ముఖ్యమంత్రిగా 55 ఏళ్ల సువేందు పేరును ఖరారు చేశారు.
తర్వాత సువేందు లోక్ భవన్‌కు చేరుకొని, గవర్నర్ ఆర్.ఎన్.రవిని కలిశారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేయాలంటూ సువేందు అధికారిని గవర్నర్ ఆహ్వానించారు. శనివారం ఉదయం కోల్‌కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీ ముఖ్యమంత్రి తొలిసారిగా కొలువుదీరుతున్న రెండో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత నెలలో బిహార్‌లో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
చొరబాట్లు ఇక అసాధ్యం: అమిత్ షా
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ పాలనలో చొరబాట్లు, పశువుల అక్రమ రవాణా వంటి కార్యకలాపాలు అసాధ్యమని అమిత్ షా తేల్చిచెప్పారు. ఆయన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని కేవలం ఒక ఎన్నికల మైలురాయిగా మాత్రమే కాకుండా, అంతకు మించి జాతీయ భద్రత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఒక నిర్ణయాత్మక రాజకీయ మార్పుగా అమిత్ షా అభివరి్ణంచారు. ఈ విజయం కేవలం బీజేపీ విస్తరణకు లేదా దాని సిద్ధాంతానికి సంబంధించినది మాత్రమే కాదని అన్నారు. ఇది 21వ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించినది కూడా కాదన్నారు.
దేశ జాతీయ భద్రతలోని అతిపెద్ద లోపాల్లో ఒకదానిని ఈ విజయం పూడ్చివేస్తుందన్నారు. బెంగాల్‌లో చొరబాట్లు, గోవుల అక్రమ రవాణా ఆగిపోతాయన్నారు. చొరబాటుదార్లను గుర్తించి, బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. ఇది జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు విస్తరించిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. 1950లో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం 2026లో ఆయన సొంత జన్మస్థలంలో ఆయన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని తెలిపారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనలో అరాచకమే రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. చొరబాట్లు లేని బెంగాల్, బంగారు బెంగాల్ స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. మహిళలకు భద్రత కల్పిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేయాల్సిన బాధ్యత బీజేపీ సర్కార్‌పై ఉందన్నారు.
హామీలన్నీ అమలు చేస్తాం: సువేందు
బెంగాల్‌లో భయోత్పాత కాలం ముగిసిందని సువేందు అధికారి స్పష్టంచేశారు. రాష్ట్రంలో తొలి బీజేపీ ప్రభుత్వం సామూహిక నాయకత్వ సూత్రంపై పనిచేస్తుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సువేందు ప్రసంగించారు. రాష్ట్రంలో భయం పోయిందని, భరోసా వచ్చిందని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం వ్యక్తిగత అధికారం చుట్టూ తిరగదని స్పష్టం చేశారు. నేను కాదు మనం అనే భావనతో ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజలకు తమకు చరిత్రాత్మక విజయం కట్టబెట్టారని, హామీలు అమలు చేసిన వారి రుణం తీర్చుకుంటామని వెల్లడించారు. వాగ్దానాలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, మహిళల పట్ల నేరాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. బెంగాల్ పునరి్నర్మాణం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సానుకూల పాలన, సంకల్ప పత్రం(మేనిఫెస్టో) అమలు ద్వారా వచ్చే ఎన్నికల్లో 60 శాతానికి పైగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సువేందు తేల్చిచెప్పారు.
కౌన్సిలర్ నుంచి సీఎం దాకా...!సువేందు రాజకీయ ప్రస్థానం
కోల్‌కతా: మున్సిపల్ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన సువేందు అధికారి అంచెలంచెలుగా పైకి ఎదిగారు. ఆయన 1970 డిసెంబర్ 15న పూర్బ మేదినీపూర్‌లో బలమైన రాజకీయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు గాయత్రి అధికారి, శిశిర్ అధికారి. సోదరుడు దివ్యేందు అధికారి ఉన్నారు. సువేందు అధికారి రవీంద్ర భారతి యూనివర్సిటీ, సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఎంఏ పూర్తిచేశారు.
2021లో నందిగ్రామ్‌లో, 2026లో భవానీపూర్‌లో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని ఓడించి, సంచలనం సృష్టించారు. మొదటిసారి 1,956 ఓట్లు, రెండోసారి 15,105 ఓట్ల తేడాతో మమతను ఓడించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగింది. 2026 ఎన్నికల్లో భవానీపూర్‌లోపాటు నందిగ్రామ్‌లోనూ పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పబిత్ర కర్‌పై 9,665 ఓట్ల తేడాతో గెలిచారు. సువేందు అధికారి అవివాహితుడు. ఒకప్పుడు మమతా బెనర్జీకి వీర విధేయుడు, నమ్మిన బంటు అయిన సువేందు చివరికి ఆమెకు ప్రత్యర్థిగా మారడం, వరుసగా రెండు ఎన్నికల్లో ఓడించడం ఒక వైచిత్రి.
తృణమూల్ కాంగ్రెస్‌లో నంబర్–2
సువేందు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో మంచి అనుబంధం ఉంది. ఆయన తొలుత కాంగ్రెస్‌లో చేరారు. 1995లో కాంతీ మున్సిపాల్టీ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. సువేందు తండ్రి శిశిర్ అధికారి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. యూపీఏ–2 ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సువేందు సైతం 2009, 2014లో తామ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా నెగ్గారు.
2007లో నందిగ్రామ్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలోనే కీలక నేతగా గుర్తింపు పొందారు. 2016లో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తర్వాత నంబర్–2గా మారారు. బెంగాల్‌లో పార్టీని విస్తరించడంతో ఆయనదే కీలక పాత్ర. పార్టీలో ముఖ్యమైన బాధ్యతలను మమతా బెనర్జీ తన విశ్వాసపాత్రుడైన సువేందుకు అప్పగించేవారు.
మమత మేనల్లుడి పెత్తనాన్ని సహించలేక..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి మారిపోయింది. అతడి పెత్తనం పెరిగిపోవడం, సువేందు అధికారి ప్రాధాన్యం క్రమంగా తగ్గడం మొదలైంది. అభిషేక్ ఆధిపత్యాన్ని ఆయన పలుమార్లు ప్రశ్నించారు. ఇరువురి మధ్య విభేదాలు ముదిరాయి. మమతా బెనర్జీ సైతం మేనల్లుడికే వత్తాసు పలకడాన్ని సహించలేకపోయారు. 2020 నవంబర్ 27న మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా సమరి్పంచారు. 2020 డిసెంబర్ 17న తృణమూల్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇకపై పార్టీలో ఉండలేనని స్పష్టంచేశారు. డిసెంబర్ 19న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో సీనియర్ నాయకుల ఆధిపత్యాన్ని తట్టుకొని తన బలం పెంచుకున్నారు.
పార్టీలో జూనియర్ నేత అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మెప్పు పొందారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి కంటిలో నలుసులా మారారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెల్చుకొని తిరుగులేని విజయం దక్కించుకుందంటే దాని వెనుక సువేందు అధికారి పాత్ర మరువలేనిది. ఆయన కృషిని, పట్టుదలను బీజేపీ పెద్దలు గుర్తించారు. అందుకే అధికార పీఠం అప్పగించారు. ముఖ్యమంత్రిగా సువేందును ఎంపిక చేయడాన్ని బీజేపీలో ఎవరూ ప్రశ్నించలేదు. సువేందుపై ఒక సందర్భంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014 సెప్టెంబర్‌లో శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించింది.


