తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పాయి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే.. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ క్రమంలో మద్దుతు ఇచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే స్నేహహస్తం అందించడం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను కూడా మార్చేసింది.
సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌లో భాగంగా.. డీఎంకేతో జట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. డీఎంకేతో సంబంధాలు తెంచుకుని విజయ్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇచ్చింది. దీనిని డీఎంకే వెన్నుపోటుగా అభివర్ణించింది. స్టాలిన్ మూలంగానే ఆ పార్టీ ఐదు స్థానాల్లో నెగ్గిందని డీఎంకే.. ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా స్టాలిన్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పరస్పరం ఆరోపించుకున్నాయి. ఈ తరుణంలో ఇండియా బ్లాక్ ముగిసినట్లేనని స్టాలిన్ సైతం వ్యాఖ్యానించారు. అయితే..
ఈ ఎపిసోడ్ ఇలా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “కష్టకాలంలోనూ ఒకరినొకరు వదిలిపెట్టేవాళ్లం కాదు మేం” అని కామెంట్ ఉంచారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకే ఆయన అంటించిన చురకలనే చర్చ నడుస్తోంది.
हम वो नहीं जो मुश्किलों में साथ छोड़ दें। pic.twitter.com/p1EosEJtvV
— Akhilesh Yadav (@yadavakhilesh) May 8, 2026
ఇదిలా ఉంటే.. అఖిలేష్ యాదవ్ ఈ మధ్యకాలంలో ఈ తరహా చేష్టలతో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో తన దిష్టిబొమ్మను తగలబెట్టబోయి గాయపడిన బీజేపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుపమను ఆస్పత్రికి వెళ్లి మరీ పరామర్శించి యూపీలో ఆరోగ్యకరమైన రాజకీయాలకు తెర తీశారు.
బీజేపీని ఓడించే లక్ష్యంతో 2023లో విపక్షాలన్నీ ఇండియా కూటమి పేరుతో ఒకే వేదికపైకి వచ్చాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల్లో సీట్ల పంపకాల విషయంలో మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాలు.. వరుస ఓటములు.. ఆ కూటమిని బలహీనపరుస్తూ వచ్చాయి.
ఇక.. తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మద్దతుదారు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని.. ఆ తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేసుకుంటామని టీవీకే అధినేత విజయ్ చెబుతున్నారు. అయితే.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. పూర్తి బలం 118 ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే తాను సంతృప్తి చెందుతానని.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసుకోమని విజయ్‌కు చెబుతున్నారు. దీంతో మద్దతును కూడగట్టుకునే ప్రయత్నంలో టీవీకే తలమునకలైంది.


