సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు..

Amaravati Cases hearing in Supreme Court on Monday - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్‌ చేసి విచారించనున్నారు. రెండు అంశాలపై 35 కేసులు దాఖలయ్యాయి. ఈ కేసులను జస్టిస్ కే.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలి. శాసన, పాలన వ్యవస్థ అధికారాలలోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉంది. ఒకే రాజధాని ఉండాలని ఏపీ విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెప్తున్నారు. రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , జీఎన్ రావు కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నివేదిక, హైపవర్డ్ కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజధానిని కేవలం అమరావతిలోనే కేంద్రీకృతం చేయకుండా, వికేంద్రీకరణ చేయాలని ఈ నివేదికలు సూచించాయి.

2014-19 మధ్య కేవలం అమరావతి ప్రాంతంలో 10 శాతం మౌలిక వసతుల పనులు మాత్రమే తాత్కాలికంగా జరిగాయి. అమరావతిలో రాజధాని నిర్మాణానికి రూ.1,09,000 కోట్లు అవసరం. రాజధాని వికేంద్రీకరణ ఖర్చు కేవలం రూ.2000 కోట్లతో పూర్తవుతుంది. రైతులతో జరిగిన అభివృద్ధి ఒప్పందాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదు. వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధి జరగదని భావించడంలో ఎలాంటి సహేతుకత లేదు. రైతుల ప్రయోజనాలన్నీ రక్షిస్తాం. అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుంది, ఆ మేరకు అక్కడ అభివృద్ధి జరుగుతుంది అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

చదవండి: (సీఎం జగన్‌ ఉద్దేశంలో ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు: సజ్జల)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top