నేతన్నకు పొదుపు జాడేది? | - | Sakshi
Sakshi News home page

నేతన్నకు పొదుపు జాడేది?

May 6 2026 7:49 AM | Updated on May 6 2026 7:49 AM

ఆందోళనలో కార్మికులు..

రూ.13.24 కోట్లు బకాయి..

12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్‌

అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు.

● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్‌డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్‌డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్‌ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

రెండేళ్ల కాల పరిమితితో ఉండే త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకంలో జియోట్యాగింగ్‌ కలిగిన చేనేత కార్మికుడు వారి నెలసరి ఆదాయంలో 8 శాతం అంటే నెలకు రూ.1200 రూపాయలు, అనుబంధ కార్మికుడు నెలకు రూ.800 ఆర్‌డీ–1 బ్యాంకు ఖాతాలో ప్రతి నెల జమ చేస్తున్నారు. ప్రభుత్వం 16 శాతం అంటే చేనేత కార్మికుడికి నెలకు రూ.2,400 అనుబంధ కార్మికుడికి రూ.1,600 చొప్పున ఆర్‌డీ 2 ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం కొందరికి రెండు నెలల వరకు మాత్రమే డబ్బులు జమ చేశారు. దీంతో నేతన్నల్లో ఆందోళన నెలకొంది. ప్రతి నెల రాకపోవడంతో కొందరు కార్మికులు డబ్బు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో

3,310 జియో ట్యాగింగ్‌ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు

కార్మికుల వాటా

రూ.7.94 కోట్లు చెల్లింపు

ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లు..

రూ.2.64 కోట్లు మాత్రమే జమ

ఉమ్మడి జిల్లాలోని జియోట్యాగ్‌ కలిగిన మగ్గాల ప్రధాన కార్మికులు, అనుబంధ కార్మికులు ప్రతి నెల రూ.2 వేల చొప్పున రూ.66.20 లక్షలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.7.94 కోట్లు కార్మికులు జమ చేశారు. ప్రభుత్వ వాటా 16 శాతం అంటే రూ.15.88 కోట్లు జమ కావాల్సి ఉండగా.. రెండు నెలల డబ్బులు రూ.2.64 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఇంకా ప్రభుత్వం నుంచి రూ.13.24 కోట్లు అందాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement