భానుడు భగభగ.. | - | Sakshi
Sakshi News home page

భానుడు భగభగ..

May 6 2026 7:49 AM | Updated on May 6 2026 7:49 AM

జీవనశైలిలో

మార్పు అవసరం..

మరికల్‌: జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రతి రోజు 43 డిగ్రీలకు పైగా ఉష్రోగ్రతలు నమోదు కావడంతో జనాలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. పగటి పూట కర్ఫ్యూను తలపించేలా వీధులు మారుతున్నాయి. ఏటా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు సూర్య తాపానికి అల్లాడుతున్నారు. వృద్ధుల శక్తిస్థాయి, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి వ్యవస్థపై వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 15 వరకు అధిక ఉష్ణోగ్రతలుంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో వడ గాలుల ప్రభావం అధికమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. పనిచేసే కార్మికులు గంట లేదా రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

అధికారుల చర్యలు శూన్యం..

జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అధికారులు మాత్రం పంచాయతీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు, ఏఎన్‌ఎంల ద్వారా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్ల పంపిణీవంటి చర్యలకే పరిమితమవుతున్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో చాలాచోట్ల టెంట్లు (నీడ సౌకర్యం) కానరావడం లేవు. అలాగే పీహెచ్‌సీల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు, సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఉపాధి పథకం ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునే వీలున్నా.. కొన్ని పంచాయతీలు పట్టించుకోవడం లేదు.

తీసుకోవాల్సిన చర్యలు..

● అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వడదెబ్బ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా ఏసీ లేదా కూలర్లతో కూడిన వార్డులు సిద్ధం చేయాలి.

● ప్రయాణ ప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఉచితంగా ఓఆర్‌ఎస్‌ పాకెట్లు, మంచినీరు అందించే కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

● ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల వద్ద జ్వరం, నీరసం, డీహైడ్రేషన్‌కు సంబంధించిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి.

● రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో రోడ్ల వేడిని తగ్గించడానికి వాటర్‌ ట్యాంకర్లతో నీటిని చల్లించాలి.

● ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బహిరంగ ప్రదేశాల్లో శారీరక శ్రమతో కూడిన పనులు (భవన నిర్మాణాలు, రోడ్డు పనులు) కొనసాగకుండా ఆదేశాలివ్వాలి.

● ఉపాధి పనులు ఉదయం 6కు ప్రారంభించి 11 గంటలకల్లా ముగించేలా చూడాలి.

● ఎండ వేడిమి తట్టుకునేందుకు తేలికగా, మెత్తగా ఉండే తెలుపు, లేతరంగు నూలు దుస్తులు ధరించాలి.

● డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు, కొబ్బరి నీరు, రాగిజావా, మజ్జిగ తాగడం మంచిది.

● కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే మసాలాలు లేని ఆహారం తీసుకోవాలి. తరచూ రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి.

ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తీవ్రమైన అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

– డా. రాఘవేందర్‌రెడ్డి, వైద్యుడు,

మరికల్‌ పీహెచ్‌సీ

జిల్లాలో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు

నిర్మానుష్యంగా మారిన రహదారులు

Advertisement
 
Advertisement
Advertisement