నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుర చైర్‌పర్సన్ కొండా శ్వేత కోరారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా 17వ వార్డు పరిధిలో కొత్త పైప్‌లైన్ పనులను మంగళవారం వైస్ చైర్‌పర్సన్ మంజుల, కౌన్సిలర్ కల్పన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్‌పాండురెడ్డితో కలిసి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురపాలికకు భారీగా నిధులు మంజూరు చేయించిన ఎంపీ డీకే అరుణకు పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ పాలనతో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పుర పరిధిలో మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు కొత్త నీటిట్యాంకుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాజాగా వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ సబ కా సాత్, సబ కా వికాస్, సబ్ కా విస్వాస్ అనే నినాదాన్ని నిజం చేశాయని, దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందని చెప్పారు. కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని.. అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో జరిగే నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి రఘురామయ్యగౌడ్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నందూనామాజీ, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ పాల్గొన్నారు.


