● పేటలో ప్రధానంగా పత్తి, వరి, కంది,
వేరుశనగపైనే మార్కెట్ సెస్
● మక్తల్, కోస్గి మార్కెట్లకు చెక్‌పోస్టుల ద్వారా..
ఏటా పెరుగుతున్న మార్కెట్‌యార్డుల ఆదాయం
నారాయణపేట: జిల్లాలో ఏటా వ్యవసాయరంగం పురోగతి సాధిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో కురిసిన వర్షాలతో పంట దిగుబడులు ఆశించిన మేర పెరిగి మార్కెట్‌యార్డులో జోరుగా క్రయ, విక్రయాలు కొనసాగడంతో ఆదాయం పెరిగింది. కోస్గి, మక్తల్ మార్కెట్‌యార్డుల్లో క్రయవిక్రయాలు తక్కువగా ఉన్నా.. చెక్‌పోస్టులు, రైస్‌మిల్లులు, కాటన్ మిల్లుల ద్వారానే ఆదాయం సమకూరిందని చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో నారాయణపేట, మక్తల్‌లో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరగా.. కోస్గి మార్కెట్‌యార్డులో లక్ష్యం చేరుకోలేదని వార్షిక ఆదాయం లెక్కల ద్వారా తెలుస్తోంది.
చెక్‌పోస్టులతో ఆదాయం..
చెక్‌పోస్టులతోనే మార్కెట్లకు అదనపు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని నారాయణపేట మండలం జలాల్‌పూర్ దగ్గర, మరికల్‌లో హైదరాబాద్ రోడ్, మక్తల్ మార్కెట్ పరిధిలోని కృష్ణా మండలం టైరోడ్ దగ్గర, కోస్గిలో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టుల ద్వారా ఏటా రూ.లక్షల ఆదాయం వస్తోంది. నారాయణపేట ప్రాంతానికి యాద్గిర్, కృష్ణాకు శక్తినగర్ కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. ఆయా మార్గాల్లో సరుకులు తరలించే భారీ వాహనాలు అనేకం రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లా మీదుగా వెళ్లే ఈ వాహనాల నుంచి భారీగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్, కోస్గి మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు తక్కువగానే ఉన్నా.. చెక్‌పోస్టులు, రైస్‌మిల్లుల నుంచే ఆదాయం సమకూరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లాలో 30కి పైగా రైస్‌మిల్లులు, 7 కాటన్ మిల్లులు, ఒక దాల్ మిల్, 37 మంది ఖరీదుదారులు, 55 మంది కమీషన్ ఏజెంట్లు నిర్వహించే క్రయ విక్రయాలతో మార్కెట్లకు ఆదాయం సమకూరుతుంది. ఇదిలా ఉండగా.. జిల్లాలోని మరికల్, మద్దూర్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ అధికారులు తనిఖీలు చేపడితే మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా పత్తి, వరి పైనే..
జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గిలో వ్యవసాయ మార్కెట్లు.. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ పరిధి దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారం కావడంతో జిల్లా రైతులు ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పంటల సాగుకు మక్కువ చూపుతారు. కృష్ణానది పరీవాహకంలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటం, చెరువులు, బోరుబావుల కింద పంటలు పండించారు. యాసంగిలో వేరుశనగ, వరి పంటలు సాగుచేశారు. మరికల్, ఊట్కూర్ మండలాలతో పాటు కర్ణాటకలోని సమీప ప్రాంతాల నుంచి పంట ఉత్పత్తులు వస్తుండటంతో ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు కొనసాగుతుండటంతో లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతుంది. ప్రధానంగా పత్తి, వరి, కంది, వేరుశనగ పైనే మార్కెట్‌సెస్ అధికంగా వస్తోంది. దీంతో పేట మార్కెట్‌యార్డు ప్రస్తుతం ఉన్న గ్రేడ్–2 నుంచి మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంతో గ్రేడ్–1 దాటి స్పెషల్ గ్రేడ్‌గా మారాల్సిన అవసరం ఉంది.
లక్ష్యాన్ని అధిగమించాం..
నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌యార్డుకు ఏటా లక్ష్యానికి మించిన ఆదాయం సమకూరుతుంది. ఈ ఏడాది కూడా ఇచ్చిన లక్ష్యాన్ని దాటి క్రయవిక్రయాలు జరిగాయి. ఆ ఆదాయంతో మార్కెట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. – ఆర్.శివారెడ్డి,
మార్కెట్ చైర్మన్, నారాయణపేట


