నారాయణపేట: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడంతో మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని డీటీఓ మేఘాగాంధీ అన్నారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు బుధవారం జిల్లాకేంద్రంలోని వీర సావర్కర్ (ఓల్డ్ బస్టాండ్) చౌరస్తాలో సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులతో కలిసి మానవహారం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా డీటీఓ మేఘాగాంధీ హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, వేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతోనే జరుగుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే తగ్గించవచ్చన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాణాలను రక్షించే ముఖ్యమైన సాధనాలని.. వీటిని తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. యువత రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండి ఇతరులకు వివరించాలన్నారు. రహదారి నియమాలు పాటించడంతో సమాజాన్ని రక్షించగలమని తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని, ఇతరులను కూడా చైతన్యపరుస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణచైతన్య, ఎస్‌ఐ–2 గాయత్రి, పోలీసు, డీటీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


