‘గరళ’కంఠుడే రావాలేమో..! | - | Sakshi
Sakshi News home page

‘గరళ’కంఠుడే రావాలేమో..!

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

‘పోలేపల్లి’ పరిసర ప్రాంత వాసుల దీనగాధ

విచారణలో తేలినా..

జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్‌ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్‌ వెంకట్రావ్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్‌ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది.

కాగితాలకే పరిమితం..

విచారణ బృందం నివేదిక అందజేసిన క్రమంలో అప్పటి కలెక్టర్‌ వెంకట్రావ్‌ ప్రతి నెలా 11న కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఆ రోజు సెలవు దినమైతే మరుసటి రోజున సందర్శించి పరిశ్రమల ప్రతినిధులు, స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. కాలుష్య కట్టడిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని టీజీఐఐసీ అధికారులకు సైతం సూచనలు చేశారు. అయితే ఇవేమీ అమల్లోకి రాకముందే వెంకట్రావ్‌ సూర్యాపేటకు బదిలీ అయ్యారు. అనంతరం రవినాయక్‌, ఆయన తర్వాత విజయేందిర బోయి మహబూబ్‌నగర్‌ కలెక్టర్లుగా పనిచేశారు. వీరి హయాంలో నెలనెలా తనిఖీల అంశం తెర మీదకే రాలేదు. ఇటీవల ఖుష్బూ గుప్తా కలెక్టర్‌గా రాగా.. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా వదులుతున్న పలు పరిశ్రమలపై కొందరు కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఫొటోలతో సహా పలు ఆధారాలు సమర్పించినట్లు తెలిసింది.

‘పోలేపల్లి సెజ్‌ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాలు కాలుష్యం బారిన పడ్డాయి. ప్రధానంగా ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. తాగేందుకు,

పంటల సాగుకు, జీవచరాల ఉనికికి ఈ నీరు అసలే పనికి రాదు.’

...పరిశ్రమల కాలుష్యం, ప్రభావిత ప్రాంతాలపై పలు ప్రభుత్వ శాఖలతో ఏర్పాటైన విచారణ కమిటీ 2023 జనవరి 31న అప్పటి కలెక్టర్‌ వెంకట్రావ్‌కు అందజేసిన నివేదికలోని

అంశాలు ఇవి. మూడేళ్లుగా ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిబంధనలు పాటించని ఫ్యాక్టరీలతో పాటు ప్రభావిత పల్లెల్లో సంరక్షణ చర్యలనూ ‘అధికార’ యంత్రాంగం గాలికొదిలేసింది. ఈ క్రమంలో నెలనెలా ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా.. అటు పీసీబీ, ఇటు జిల్లా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

సెజ్‌లోని ఓ పరిశ్రమ బయటికి

వదిలిన కాలుష్యం జలాలు

ప్రస్తుతం పీసీబీ ఆడిందే ఆట..

పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్‌గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్‌లోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమరైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్‌ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్‌ (బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫార్మా, తదితర పరిశ్రమల పొల్యూషన్‌తో బతుకులు ఛిద్రం

తాగు, సాగుకు ఆ నీరు పనికిరాదని తేల్చిన విచారణ బృందం

కలెక్టర్లు మారినా.. మారని బాధిత గ్రామాల ప్రజల తలరాతలు

ఉత్తుత్తి మాటలుగానే నెలనెలా తనిఖీలు.. పీసీబీ తీరుపై అనుమానాలు ?

ప్రస్తుత కలెక్టర్‌ అయినా దృష్టి సారించాలని బాధిత రైతుల విజ్ఞప్తి

Advertisement
 
Advertisement
Advertisement