భూ సారం.. ఫలితం శూన్యం | - | Sakshi
Sakshi News home page

భూ సారం.. ఫలితం శూన్యం

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

–8లో u

నర్వ: రైతులు భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటల సాగు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ జిల్లా రైతులకు భూసార పరీక్షలు అందని ద్రాక్షగా మారాయి. 2018లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 77 క్లస్టర్లకు మినీ భూసార పరీక్ష కేంద్రాలు మంజూరు చేసింది. ఆయా కేంద్రాల్లో కేటాయించిన గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఫలితాల పత్రాలు అందజేయాలని ఆదేశించింది. కాగా ఆయా కేంద్రాలకు పరీక్షల నిమిత్తం ఉపయోగించే రసాయనాలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో నిరుపయోగంగా మారాయి. భూ సమగ్ర సర్వేలో అధికారులు రైతుల నుంచి సేకరించిన మట్టి నమూనాలను జడ్చర్లలోని భూసార పరీక్ష కేంద్రానికి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల ఫలితాల కార్డులను నేటికీ అందించలేదని రైతులు చెబుతున్నారు.

వృథాగా పరీక్షల కిట్లు..

కేంద్ర ప్రభుత్వం ఒక్కో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ.1.30 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 523 వ్యవసాయ క్లస్టర్లకు భూసార పరీక్షల కిట్లు ఇచ్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)భూసార పరీక్షలు నిర్వహించాలి. ప్రారంభంలో మన తెలంగాణ.. మన వ్యవసాయం కార్యక్రమంలో భాగంగా కొన్నాళ్ల పాటు భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రైతులకు అందించారు. 2020 కంటే ముందు వానాకాలం ప్రారంభంలోగా భూసార పరీక్షలు చేయించుకోవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తర్వాత ఈ కిట్లు అటకెక్కాయి. నిధులు లేకపోవడంతో పరీక్షలు చేయడం లేదని మండల వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 476, నారాయణపేట జిల్లాలో 77 రైతువేదికలు ఉన్నాయి. వీటిలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు ఒక్కో కేంద్రానికి రూ.2 లక్షలు మంజూరుచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు.

గతేడాది నిర్వహించాం..

నీతి ఆయోగ్‌ ద్వారా ఆస్పిరేషన్‌ బ్లాక్‌గా ఎంపికై న నర్వ మండలంలో గత ఏడాది ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహించాం. ఫలితాల కార్డులను ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రైతులకు అందించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. – అఖిలారెడ్డి,

మండల వ్యవసాయ అధికారి, నర్వ

జడ్చర్లలో మాత్రమే..

రైతులు తాము సాగు చేస్తున్న భూముల మట్టి పరీక్షలను ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఉమ్మడి జిల్లాలో జడ్చర్లలో మాత్రమే భూసార పరీక్ష కేంద్రం ఉంది. 2018లో ఏఈఓ క్లస్టర్ల వారీగా మినీ కేంద్రాలను మంజూరు చేశారు. ఆయా కేంద్రాలకు కెమికల్స్‌, సామగ్రి పూర్తిస్థాయిలో సరఫరా గాకపోవడంతో పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భూసార పరీక్షలు అవసరమైన రైతులు జడ్చర్ల ల్యాబ్‌లో నామినల్‌ ఫీజు చెల్లించి చేయించుకోవచ్చు.

– నాగేష్‌కుమార్‌, ఏడీఏ, మక్తల్‌

జిల్లాలో 77 క్లస్టర్లకు మినీ కేంద్రాలు మంజూరు

ఘనంగా ప్రారంభం.. తర్వాత నిరుపయోగం

వృథాగా మారిన కిట్లు

పాత పద్ధతిలో సాగు.. రైతులు నష్టాల పాలు

Advertisement
 
Advertisement
Advertisement