● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: భారత రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు దిక్సూచిగా నిలిచిన డా. బీఆర్ అంబేడ్కర్‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శకంగా తీసుకొని ముందుకుసాగాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలకు ఆయనతో పాటు ఎస్పీ డా. వినీత్ హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... డా. బీఆర్ అంబేడ్కర్ కష్టపడి చదివి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించడానికి తన మేధాశక్తిని వినియోగించారని గుర్తు చేశారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపర్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆనాడే విదేశాల్లో విద్యనభ్యసించిన ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లేంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎస్పీ డా. వినీత్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గొప్ప సందేశం, మార్గదర్శకమన్నారు. కులమతాలకు అతీతంగా సంఘటితంగా నిలబడి అన్యాయాలపై పోరాడితేనే సమాజంలో సుస్థిర మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన సాధనం చదువు ఒక్కటే అని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకుసాగి తమ లక్ష్యాలను సాధించాలని, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ కొండ శ్వేత సత్యయాదవ్, సదాశివరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌డీసీ రాజేందర్‌గౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ.వెంకట్రాములు, షెడ్యూల్డ్ కులాల అధికారి అబ్దుల్ ఖలీల్, పుర కమిషనర్ నర్సయ్య, సీపీఓ కాగవాహన్, డీపీఆర్వో రషీద్, డీటీఓ మేఘాగాంధీ, కౌన్సిలర్ మహేష్, సంఘం నాయకులు శరణప్ప, ఆశప్ప, కృష్ణ, సూర్యకాంత్, ఈశ్వరమ్మ, మాధవ, సోఫీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వసతిగృహాల్లో మౌలిక వసతుల కల్పన..
ఊట్కూర్: వసతిగృహాల్లో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం స్థానిక ఎస్సీ, ఎస్టీ బాలురు వసతిగృహాన్ని ఎస్పీ డా. వినీత్‌తో కలిసి ఆయన సందర్శించారు. వంటశాల, నివాస గదులు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు సక్రమంగా వినియోగిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వసతులు, సమస్యనల గురించి ఆరా తీశారు. అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రోజు మెనూ విధిగా పాటించాలని వార్డెన్‌ను ఆదేశించారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను విద్యార్థులతో కలిసి టీవీలో వీక్షించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే వసతులను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణ కలిగి ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రేణుక భరత్, ఈడీ ఖలీల్, ఏఎస్‌డబ్ల్యూ పరమేశ్, వార్డెన్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రతపై ప్రతిజ్ఞ
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొని వాహన చోదకులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం, ఇతరులకు తెలియజేయడం, తోటి చోదకులను గౌరవించడం, ప్రమాదాలను నివారించడం, డిఫెన్స్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి వివరించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని వారు సూచించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, పుర చైర్‌పర్సన్ కొండ శ్వేత, సత్యయాదవ్, సీఐ శివశంకర్, డీటీఓ మేఘాగాంధీ, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, పురుషోత్తం, కృష్ణచైతన్య, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.


