పాలమూరు: చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా మంగళవారం సాయంత్రం స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నారీశక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ డీకే అరుణ హాజరై మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ కూడలిలో బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చట్టం చేయబోతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రతి ఒక్క పార్టీ సభ్యులు పాల్గొని ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రాజకీయాల్లో రాణించే శక్తి, పాలించే శక్తి మహిళలకు ఉందన్నారు. దేశ పరిపాలనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే తమ కుర్చీలు, ప్రాధాన్యత పోతుందని మహిళ బిల్లును అడ్డుకునే ప్రయత్నం గతంలో కొందరు చేశారన్నారు. 2029లో మహిళా రిజర్వేషన్ 33 శాతం అమలు చేయాలని ప్రధాని కంకణం కట్టుకొని పని చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కొత్తగా 60 అసెంబ్లీ స్థానాలు పెరిగితే 60 మంది మహిళలు ఎమ్మెల్యేలు అవుతారని వెల్లడించారు. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలన్నారు.


