మిడ్జిల్: అక్రమంగా నిల్వ ఉన్న బియ్యాన్ని ప ట్టుకున్న ఘటన ఆదివారం మండలంలోని మసిగొండ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మహ్మద్ సుల్తాన్ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు పో లీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో కలిసి సుల్తాన్ నివాసంలో సోదా లు నిర్వహించారు. 52 క్వింటాళ్ల రేషన్ బి య్యం బొలెరో వాహనంలో తరలిస్తుండగా గుర్తించారు.వాహనంలో 104 బస్తాలు ఉన్న ట్లు తేలింది. రెవెన్యూ అధికారులకు సమాచా రం ఇవ్వగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ వెంకటేశ్వర్‌రెడ్డి ఘటన స్థలానికి వచ్చి విచారణ చేసి బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.2.66 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ధాన్యం రాశులతో కళకళ
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డు ధాన్యం రాశులతో కళకళలాడింది. సోమవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యం అమ్మకానికి తెచ్చారు. కోయిల్‌సాగర్ ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలు, బోరుబావుల కింద యాసంగిలో సాగు చేసిన వరి పంటలు కోతలు కోస్తుండడంతో రైతులు దిగుబడులను నేరుగా మార్కెట్‌కు అమ్మకానికి తెస్తున్నారు. సోమవారం మార్కెట్‌కు దాదాపు 6 వేల బస్తాల ధాన్యం అమ్మకానికి రావడంతో మార్కెట్ ఆవరణ అంతా ధాన్యం కుప్పలతో నిండిపోయింది.
ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా రూ.2,150
మార్కెట్‌లో జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,150, కనిష్టంగా రూ.1,916 ధరలు లభించాయి. హంస ధాన్యం గరిష్టంగా రూ.1,799, కనిష్టంగా రూ.1,736 చొప్పున పలికాయి.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
పాన్‌గల్: అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడిన ఇసుక ట్రాక్టర్ యజమానిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుర్మయ్య తెలిపారు. మండలంలోని మాధరావుపల్లి గ్రామం నుంచి పాన్‌గల్‌కు ఏలాంటి అనుమతులు లేకుండా శివ తన ట్రాక్టర్ ద్వారా ఇసుకను తరలిస్తున్న క్రమంలో సోమవారం తెల్లవారుజామున పోలీసుల తనిఖీల్లో ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందిన ఘ టన మండలంలోని కుమ్మెరలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ కథనం ప్రకారం.. కుమ్మెర గ్రామానికి చెందిన సురేందర్‌బాబు (39) కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. ఇతడు గ్రామ సమీపంలోని పల్లె చంద్రశేఖర్ వ్యవసాయ పొలం వద్ద బోరు మో టారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్ చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
కాల్వలో పడి వృద్ధుడు మృతి
● నారాయణపేట జిల్లావాసిగా గుర్తింపు
నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని కందులవారిగూడెం సమీపంలో జాన్‌పహాడ్ మేజర్ కాల్వలో వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. కందులవారిగూడెం గ్రామ సమీపంలో జాన్‌పహాడ్ మేజర్ కాల్వలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువస్తుండగా.. స్థానిక వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని గుర్తించారు. మృతదేహాన్ని ఫొటో తీసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయగా.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామానికి చెందిన నామల్ల రాయప్ప(70)గా గుర్తించారు. రాయప్ప సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో గొర్రెల కాపరిగా పనిచేస్తున్న తన కుమారుడు నామల్లి వెంకటేష్‌ను కలిసేందుకు ఈ నెల 10న వచ్చాడని, ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై రాయప్ప కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపారు.


