కేజీబీవీలు బాలికల భవిష్యత్‌కు నిలయాలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలు బాలికల భవిష్యత్‌కు నిలయాలు

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

తిమ్మాజిపేట: కేజీబీవీలు బాలికల సమగ్ర అభివృద్ధి, భవిష్యత్‌కు నిలయాలుగా మారాయని, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివి బాలికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ప్రాంతీయ విద్యా సంచాలకులు సోమిరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆర్‌జెడీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. బాలికలకు విద్యతోపాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, సృజనాత్మకత అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకునే బాలికలు విద్యద్వారా జీవితంలో ఉన్నత స్థానాలను సాధించే అవకాశాలు కేజీబీవీలో విస్తతంగా ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, వంటి లక్షణాలను పెంపొందించుకొని భవిష్యత్‌లో సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడలు, యోగా, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం బలంగా ఉంటేనే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించగలమన్నారు. బాలికల విద్యాభివృద్ధి ద్వారా సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం పెరుగుతాయని మహిళలు అన్నిరంగాల్లో మందంజలో ఉండేలా ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుమందు ఉపాధ్యాయునులతో సమావేశమై పలు విద్యా అంశాలపై చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రంశసా పత్రాలు అందజేశారు.

రూ.80వేల పరికరాలు

అందజేత

మార్చిలో కేజీబీవీని సందర్శించిన ఆర్‌జేడీ సోమిరెడ్డి సందర్శించిన సమయంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి రూ.80వేల విలువైన పరికరాలను అందజేశారు. 30లీటర్ల సామర్థ్యం గల రెండు చల్లని తాగునీటి విద్యుత్‌ యంత్రాలను పంపిణీ చేశారు. బాలికల ఆరోగ్య పరిరక్షణకు బీపీ కొలిచే యంత్రం, థర్మామీటరు, స్టెతస్కోప్‌, బరువు కొలిచే యంత్రం వంటి వైద్య పరికరాలను అందజేశారు. బాలికలకు ప్రత్యేకంగా సిక్‌రూమ్‌ ఏర్పాటు చేసి ప్రారంభించారు. త్వరలో 10కంప్యూటర్‌ బేబుళ్లను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్‌ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement