జనగణనలో ఓబీసీల లెక్క తేల్చాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో ఓబీసీల లెక్క తేల్చాలి

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం

మాజీ ఎంపీ వి.హనుమంతరావు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా గణనలో ఓబీసీల లెక్క తేల్చాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. మహబూబ్‌నగర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ ముదిరాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు చేపట్టిన భారత్‌జోడో యాత్రతో దేశంలో ఓబీసీల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఎవరు ఎంత ఉన్నారో.. వారికి అంతస్థాయిలో వాటా ఉండాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు ఎన్నికల ముందు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించడం జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టి 56 శాతం బీసీలు ఉన్నారని లెక్క తేల్చి రాజకీయంగా వారికి అవకాశాలు కల్పించడానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఇటీవల సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ చాలా బీసీలకు అవకాశం దక్కిందన్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓబీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ ఈ వర్గానికి చేసిందేమిలేదని విమర్శించారు. ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 16న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ ఓబీసీ రాష్ట్ర కన్వీనర్‌ కేతూరి వెంకటేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, లక్ష్మణ్‌, సీజే బెనహర్‌, రాములుయాదవ్‌, ఉషారాణి, పరమేశ్‌, తిరుపతయ్య, శ్రీనివాసులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement