విహారయాత్రలో విషాదం | - | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో విషాదం

Apr 14 2026 8:34 AM | Updated on Apr 14 2026 8:34 AM

గోవాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

చెట్టును ఢీ కొట్టిన కారు

ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు

గద్వాల క్రైం: నలుగురు స్నేహితులు కలసి గోవా పర్యటనకు వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి గాయాలైన ఘటన గద్వాల మండలం వీరాపురం గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా పెంట్లవెల్లి గ్రామానికి చెందిన ఇంతియాజ్‌ (24), ముజమ్మిల్‌ మరో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన హజీ, ఇర్ఫాన్‌ నలుగురు స్నేహితులు కలసి ఈ నెల 9న కారులో గోవాకు వెళ్లారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారు జామున వీరాపురం శివారులో డ్రైవింగ్‌ చేస్తున్న ఇర్ఫాన్‌ నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపుతప్పింది. రోడ్డు ఎడమ వైపున ఉన్న భారీ చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు స్నేహితులకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షత్రగాతులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతియాజ్‌ చికిత్స పొందుతూ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ఇర్ఫాన్‌, ముజమ్మిల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు ముర్తజావలి ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

అతివేగమే కారణం..

గోవా నుంచి కారులో బయలుదేరిన స్నేహితులు వీలైనంత త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో అతివేగంగా కారును డ్రైవ్‌ చేసినట్లు సమాచారం. మరోవైపు సరైన నిద్రలేకపోవడం గంటల తరబడి రోడ్డు ప్రయాణంతో అలసిపోయి నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా స్నేహితులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement