● రాష్ట్రంలో ఏటా 5 లక్షల ప్రమాదాలు.. లక్షల సంఖ్యలో మరణాలు
● అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఎస్పీ డా. వినిత్
దామరగిద్ద/కోస్గి రూరల్: రహదారి నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారిద్దామని ఎస్పీ డా. వినీత్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం దామరగిద్దలో సర్పంచ్ కన్కిరెడ్డి అధ్యక్షతన, గుండుమాల్‌లోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన అరైవ్–అలైవ్ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని .. అందులో 1.50 లక్షల మంది మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదల కంటే రోడ్డు ప్రమాదాలే అధికమని.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు రోడ్డు భద్రత వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్స్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, ముఖ్య నాయకులతో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని యువత ప్రమాదాలకు గురికాకుండా రహదారి నిబంధనలు పాటించేలా కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని ఈ నెల 18 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని, అలాంటి ఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని వివరించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, నాలుగు చక్రాల చోదకులు సీట్‌బెల్ట్ ధరించాలని, మితిమిరిన వేగం పనికిరాదని, మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా వెంటబెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, డీటీఓ మేఘాగాంధీ, తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీఓ ఉదయ్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఈదప్ప, ఎస్‌ఐ రాజు, బాలరాజు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, రఘు, వెంకట్రామారెడ్డి, నీలి మాణిక్యప్ప, గుండుమాల్‌లో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ తిరుపతయ్య, సర్పంచ్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


