నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏడు పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించారు. ప్రతి పరీక్షకు చదువుకునేందుకు నాలుగు నుంచి ఐదు రోజులు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ సమయం పట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకపోవడంతో ఇటు విద్యాశాఖ, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలోని 43 కేంద్రాలకు 8,319 మంది విద్యార్థులను కేటాయించగా.. సోమవారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 8,304 మంది హాజరుకాగా, 15 మంది గైర్హాజరయ్యారు. 99.8 హాజరు శాతం నమోదైంది. అదేవిధంగా ఒక ప్రైవేట్ కేంద్రంలో ఇద్దరిని కేటాయించగా.. వందశాతం హాజరు నమోదైంది. సిట్టింగ్‌స్కాడ్, ఫ్లయింగ్‌స్కాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. బుధవారం ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష జరగనున్నట్లు డీసీఈబీ కార్యదర్శి శశికుమార్ తెలిపారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు రాసిన విధానంపై ఆరా తీశారు. పలువురు విద్యార్థులు సినిమా థియేటర్ల వైపు వెళ్లగా, మరికొందరు మిత్రులతో కలిసి హోటళ్లలో భోజనాలు చేయడం కనిపించింది. కేజీబీవీ, గురుకుల, ఇతర హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు తమ ఇళ్లకు పయనమయ్యారు.


