● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించనున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జోంగ్తు, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంక హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారి భద్రతపై అనేక చర్యలు చేపట్టినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల సంఖ్య పెరగడం, మెరుగైన రహదారులతో అధిక వేగం, సరైన డ్రైవింగ్ శిక్షణ లోపం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తదితర కారణాలు ప్రమాదాల పెరుగుదలకు దారి తీస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు వారం పాటు జరిగే అరైవ్.. అలైవ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విస్తృత అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెంచడం, బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 13న గ్రామస్థాయి రోడ్డు భద్రత కమిటీల ఏర్పాటు, 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రత ప్రమాణ స్వీకారం, 15న ‘చిల్డ్రెన్ రోడ్ సేఫ్టీ డే’ నాలుగేళ్లు పైబడిన పిల్లలకు సీట్‌బెల్ట్ వినియోగంపై అవగాహన, 16న ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రత్యేక ప్రచారం, సోషల్ మీడియా ద్వారా అవగాహన, 17న ప్రమాదాల అనంతరం తక్షణ వైద్య సాయం కోసం గోల్డెన్ హవర్ శిక్షణ కార్యక్రమాలు, 18న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సెలింగ్, ప్రవర్తన మార్పు, ట్రాఫిక్ నియమాలు పాటించడం కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీటీఓ మేఘాగాంధీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జయచంద్రమోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ..
జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాం పటిష్ట భద్రత మధ్య ఉందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్లు ఫణీంద్రరెడ్డి, శ్రీనుతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత, పోలీసుల బందోబస్తును పర్యవేక్షించారు. అనంతరం మాట్లాడుతూ... ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట తహసీల్దార్ అమరేంద్ర కృష్ణ, కలెక్టరేట్ సి–సెక్షన్ అధికారులు జయసుధ, రాణిదేవి ఉన్నారు.


