క్రీడల్లో రాణించి దేశ కీర్తిని చాటాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణించి దేశ కీర్తిని చాటాలి

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

నారాయణపేట: క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం పెంపొందుతాయని.. క్రీడాకారులు క్రీడల్లో రాణించి భారతదేశ కీర్తిని చాటాలని, అంతర్జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ చాటేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ను ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల కో–ఆర్డినేటర్లకు క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లును పంపిణీ చేశారు. టాస్‌ వేసి పోటీలను ప్రారంభించడంతో పాటు క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు బ్యాటింగ్‌ చేశారు. సర్వీస్‌ చేసి వాలీబాల్‌ ఆటను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధానమంత్రి సంసద్‌ ఖేల్‌ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, ఖో–ఖో, కబడ్డీ పోటీలు మండల, అసెంబ్లీ నియోజకవర్గ, పార్లమెంట్‌స్థాయిలో కొనసాగుతాయని చెప్పారు. మండలస్థాయిలో గెలుపొందిన జట్లు నియోజకవర్గస్థాయిలో.. అక్కడ గెలిచిన జట్లు పార్లమెంట్‌ స్థాయిలో ఆడుతారని, మహిళల విజేత జట్లకు ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు. మొదటిసారి నాలుగు క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి అన్నిరకాల పోటీలు నిర్వహించుకుందామని చెప్పారు. ఈ నెల 24న ముగింపు వేడుక మహబూబ్‌నగర్‌లో ఉంటుందని.. వేడుకకు గవర్నర్‌ హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేస్తారని వివరించారు.

రాష్ట్ర ఖజానా ఖాళీ..

గ్రామాల్లో అభివృద్ధి పనులు కేంద్ర నిధులతో కొనసాగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లు, సీసీ రోడ్లును ఆమె ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని తగ్గించి, ఆర్థికాభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ ప్రయత్నం చేస్తున్నారని.. కాంగ్రెస్‌ను గెలిపించి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. భారతదేశ అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రత్యర్థి దేశాలు కుట్రలు పన్నుతున్నాయని.. ప్రజలపై యుద్ధం ప్రభావం లేకుండా పాలన కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని.. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆరోపించారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే కేంద్ర పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయన్నారు. వికాసిత్‌ భారత్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఎంఎస్‌కేఎం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ ముచ్చర్లపల్లి జనార్దన్‌రెడ్డి, పేట జిల్లా కన్వీనర్‌ తిరుపతిరెడ్డి, బీజేపీ సీనియర్‌ నాయకులు నాగురావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు రతంగ్‌పాండురెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు కొండయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ కొండా శ్వేత, వైస్‌ చైర్మన్‌ మంజుల జీఆర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోషల్‌ వినోద్‌కుమార్‌, కౌన్సిలర్‌ సత్య రఘుపాల్‌రెడ్డి, నాయకులు రఘురామయ్యగౌడ్‌, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement