కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు పురపాలికలో గురువారం సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు పర్యటించారు. పట్టణంలో శిథిలావస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణం, ప్రహరీ నిర్మాణానికి హద్దులు ఏర్పాటుచేసి అంచనాలను సిద్ధం చేసి నివేదిక పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట కాడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంకన్న, సృషాఖాన్, ఆర్‌ఎం సంతోష్‌కుమార్, తహసీల్దార్ మహేష్‌గౌడ్, పుర కమిషనర్ శ్రీకాంత్, చైర్మన్ సరస్వతి జనార్దన్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గూళ్ల నర్సింహులు, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు: ఎస్పీ
నారాయణపేట: బాధితుల సౌలభ్యం కోసం తెలంగాణ పోలీసులు ఇంటి వద్దే ఎఫ్‌ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఎస్పీ డా. వినీత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానంలో బాధితులు పోలీస్‌స్టేషన్‌న్‌కు రావాల్సిన అవసరం ఉండదని.. ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి, అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదు రాయలేని పరిస్థితుల్లో పోలీసులే వాంగ్మూలాన్ని వారి భాషలో రాసి చదివి వినిపించి సంతకం తీసుకొని అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రతిని అందజేస్తారని చెప్పారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీనవర్గాల వారికి ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపర్చే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ, ఆస్తి సంబంధిత నేరాలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, బాల్య వివాహ నిరోధక చట్టాలకు సంబంధించిన కేసుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వివరించారు. మహిళలు, పిల్లల కేసుల్లో మహిళా పోలీసు అధికారిని తప్పనిసరిగా పంపిస్తామని.. అవసరమైతే ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయుల సమక్షంలో వాంగ్మూలం నమోదు చేస్తారని చెప్పారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకొని నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు కట్టుబడి పని చేస్తున్నారని పేర్కొన్నారు.
11న భారీ ర్యాలీ
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11న డ్రగ్స్ కంట్రోల్ రెగ్యులేటరీ బలోపేతం దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ ఏడీ దినేష్‌కుమార్ వెల్లడించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం నగరంలోని సరోజిని రాములమ్మ ఫార్మసీ కళాశాలలో డ్రగ్ అబ్యూస్–డ్రగ్ అడిక్షన్ అనే అంశంపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న క్లాక్‌టవర్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ ఉంటుందని తెలిపా రు. అనంతరం శివమ్ కన్వెన్షన్ హాల్‌లో డ్రగ్ దుర్వినియోగం నివారణతో పాటు మరో ఏడు రకాల అంశాలపై అవగాహన సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా నకి లీ మందులు ఉంటే వెంటనే 180059 96969కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


