నారాయణపేట: మత్స్యకారుల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతామని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక సీవీఆర్ భవన్‌లో జరిగిన జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కాంతుకుమార్ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు అందజేసి చేతులు దులుపుకొందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహకారంతో మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని రూ.4,500 కోట్లతో చేపట్టి ఈ ప్రాంతంలోని చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. చెరువులు నిండితే చేపల ఉత్పత్తి పెరుగుతుందని.. మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. ఈసారి బడ్జెట్‌లో మత్స్యశాఖకు భారీగా నిధులు కేటాయించారని.. వాకిటి శ్రీహరి మత్స్యశాఖకు మంత్రిగా ఉండటం అందరికీ కలిసి వస్తుందన్నారు. జిల్లా మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సొసైటీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతుకుమార్‌కు సూచించారు. మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, మాజీ చైర్మన్ సరాఫ్ నాగరాజు, మార్కెట్ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్, కోట్ల రవీందర్‌రెడ్డి, సర్ఫరాజ్ అన్సారీ, న్యాయవాది సతీష్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.


