● కలెక్టర్ ప్రతీక్ జైన్
నారాయణపేట: జిల్లా పాలనలో రెవెన్యూ వ్యవస్థ అత్యంత కీలకమని.. ఆ శాఖ అధికారులు ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి ఎక్కువ శాతం భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయని.. మండలస్థాయిలోనే పరిష్కరిస్తే ఇక్కడి వరకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. అదేవిధంగా సాదాబైనామా దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని.. రెవెన్యూ అదనపు కలెక్టర్ అనుమతి లేకుండా సీజ్ చేసిన ఇసుక వాహనాలను వదలొద్దని తేల్చి చెప్పారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని, సోలార్ పవర్ ప్లాంట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కుల ధ్రువీకర ణ పత్రాల జారీలో అలసత్వం సరికాదని తెలిపారు. వీటి తోపాటు లోకాయుక్త , బైండోవర్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఏప్రిల్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభమవుతుందని.. అంతలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని కోరారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఆర్డీఓ రామచందర్‌నాయక్, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, సి–సెక్షన్ అధికారు లు జయసుధ, అఖిల ప్రసన్న పాల్గొన్నారు.


