నారాయణపేట: పట్టణంలోని పెట్రోల్, డీజిల్ బంక్‌లను బుధవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 44 పెట్రోల్ బంకులు ఉండగా.. 75 శాతం బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని డీఎస్‌ఓ బాలరాజు పేర్కొన్నారు. మిగతా 25 శాతం బంకుల యజమానులు ఆయిల్ కంపెనీలకు డీడీలు చెల్లించారని.. రాత్రిలోగా ట్యాంకర్లు బంక్‌లకు చేరుతాయని యజమానులు చెప్పినట్లు తెలిపారు. జిల్లాలోని వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 8 ఎల్పీజీ ఏజెన్సీలు ఉన్నాయని... ఆయా ఏజెన్సీల్లో సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.


