మరికల్: ఆటోను వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయలైన ఘటన పట్టణ శివారులోని రైల్వేబ్రిడ్జి దగ్గర బుధవారం చోటుచేసుకుంది. ఆటో మరికల్‌లో ప్రయాణికులను ఎక్కించుకొని జిన్నారానికి వెళ్తుండగా రైల్వే బ్రిడ్జి సమీపంలో వెనకాల నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. డ్రైవర్ వాజీద్, ఆటోల్లో ఉన్న కృష్ణమ్మ అనే ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నిధులు మంజూరు చేయడం
అభినందనీయం
ఊట్కూర్: మండలంలో సీసీ రోడ్ల ఏర్పాటుకు ఎంపీ డీకే అరుణ రూ. 54 లక్షలు మంజూరు చేయడం హర్షనీయమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఊట్కూర్‌కు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, వల్లంపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దజట్రం గ్రామానికి రూ.5 లక్షలు, లక్ష్మిపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, పెద్దపొర్ల గ్రామానికి రూ.5 లక్షలు, కొత్తపల్లి గ్రామానికి రూ.5 లక్షలు, బిజ్వార్ గ్రామానికి రూ.5 లక్షలు, ముగ్దుంపూర్ గ్రామానికి రూ.5 లక్షలు మొత్తం రూ.45 లక్షలు మంజూరు చేశారన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు వెంటనే పనులను ప్రారంభించి నాణ్యతతో సీసీ రోడ్లు వేయాలని కోరారు. సమావేశంలో సర్పంచ్‌లు వాకిటి వెంకటేష్, అర్జున్‌కుమార్, నాయకులు కిరన్, బాలాంజనేయులు, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
ఆడబిడ్డల తల్లులకు వరం ‘కల్యాణలక్ష్మి’
దామరగిద్ద: ఆడబిడ్డలు అంటే భారం కాదు వరమని తెలిసేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను అమలు చేస్తుందని ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి, సర్పంచ్ కన్కిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తిరుపతయ్య సమక్షంలో లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో 207 మందికి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కన్కిరెడ్డి, విండో మాజీ అద్యక్షుడు ఈదప్ప మండల పార్టీ అద్యక్షుడు బాల్‌రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఖాజా, రఘు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
నేటి నుంచి మన్యంకొండలో
వసంత నవరాత్రి ఉత్సవాలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణలు నిర్వహించనుండగా, మధ్యాహ్నం 11 గంటలకు పంచాంగ శ్రవణం నిర్వంచనున్నారు. రాత్రి స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నారు. ఈనెల 23, 24వ తేదీల్లో సుందరకాండ పారాయణం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. 28న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం అఖండ భజన ప్రారంభమవుతుంది. ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షాన్ని పొందాలని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు కోరారు.


