నారాయణపేట: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ఎంతో విశిష్టమైనదని.. అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఎస్పీ డా.వినీత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జామా మసీదు, హజికన్‌పేట్ మసీదు వద్ద ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌లో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, కౌన్సిలర్ రవికుమార్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు అమీర్‌రుద్దీన్, దస్తగిరి చాంద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్ గౌడ్, తఖీ పాల్గొన్నారు.
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఎస్పీ డాక్టర్ వినీత్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో తీపి, చేదు, కష్టాలు, సుఖాలు సహజమని, వాటిని సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలు శాంతి భద్రతలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


