మరికల్: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ధన్వాడకు చెందిన లలిత (65) భర్త ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి మరికల్‌లో యాచిస్తూ బస్టాండ్‌లోనే ఉండేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు.
జూరాల కాల్వలోకి దూసుకెళ్లిన కారు
వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ శివారులోని జూరాల కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్ చెందిన షకీల్ కారులో పెబ్బేరు మండలంలోని సూగూరుకు వస్తుండగా మార్గ మధ్యలో పెబ్బేరు శివారులోని జూరాల కాల్వ వద్ద బైక్ అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. కారులో ఉన్న షకీల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు వెనుక అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది.


