మక్తల్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బురాన్ సమకూర్చిన దుస్తులను మంత్రి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు కొత్త దుస్తులు అందించిన బురాన్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, వాకిటి హన్మంతు, సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, చెన్నమ్మ, జుట్ల అనిత, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025–26లో భాగంగా బ్యాంకు అనుసంధానంతో అందించే ఆర్థిక సహాయ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం పథకం కింద ఈవీ టు వీలర్, ఈవీ త్రీ వీలర్, వ్యవసాయ పథకం కింద సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్ యూనిట్లను బ్యాంకు లింకేజీతో జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21 నుంచి 50 ఏళ్ల వయసు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 నుంచి 60 ఏళ్ల వయసు కలిగి.. గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2లక్షల వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 17 నుంచి 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అంగన్‌వాడీల
అక్రమ అరెస్టు తగదు
నారాయణపేట: తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన అంగన్‌వాడీలను ప్రభుత్వం పోలీసులచే అక్రమ అరెస్టులకు పాల్పడటం తగదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని మద్దూర్, మక్తల్ , నారాయణపేట ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి అక్రమంగా అరెస్టులకు పాల్పడటం దారుణమన్నారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస వేతనం రూ. 18వేలకు పెంచాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లతో పాటు సీఐటీయూ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పట్టణాభివృద్ధికి
సహకరించండి
నారాయణపేట: మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సకాలంలో ఆస్తి, నీటి, వ్యాపార పన్నులను చెల్లించి.. పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య కోరారు. సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో కలిసి బకాయి ఆస్తిపన్ను వసూలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం మరో 15 రోజుల్లో ముగుస్తున్నందున ప్రజలు తమ ఆస్తి, నీటి పన్ను, వ్యాపార పన్నలును సకాలంలో చెల్లించాలని కోరారు. కమిషనర్ వెంట ఆర్‌ఐలు సందీప్, శివకుమార్, వార్డు ఆఫీసర్లు సుభాని, తిప్పన్న, బిల్ కలెక్టర్ ప్రదీప్ ఉన్నారు.
తెల్లకుసుమలు
క్వింటా రూ.5,406
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం తెల్లకుసుమలు క్వింటాకు రూ. 5,406 ధర పలికింది. శనగలు గరిష్టంగా రూ. 5,175, కనిష్టంగా రూ. 5,105, పెసర గరిష్టంగా రూ. 7,912, కనిష్టంగా రూ. 5,052, వేరుశనగ గరిష్టంగా రూ. 6,636, కనిష్టంగా రూ. 4,069, జొన్నలు గరిష్టంగా రూ. 5,325, కనిష్టంగా రూ. 2,250, అలసందలు గరిష్టంగా రూ. 5,816, కనిష్టంగా రూ. 4,025, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,809, కనిష్టంగా రూ. 5,209, తెల్లకందులు గరిష్టంగా రూ. 7,569, కనిష్టంగా రూ. 7,069 ధరలు పలికాయి.


