కలెక్టరేట్‌ పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ పనుల్లో వేగం పెంచండి

Mar 17 2026 8:41 AM | Updated on Mar 17 2026 8:41 AM

మూడు నెలల్లో నిర్మాణం పూర్తికావాలి

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

నారాయణపేట: జిల్లా కేంద్రం సమీపంలో రూ. 55కోట్లతో చేపట్టిన కలెక్టరేట్‌ సముదాయం నిర్మాణ పనుల్లో వేగం పెంచి.. త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌ జైన్‌.. ప్రస్తుత కలెక్టరేట్‌ నుంచి నేరుగా కొత్త భవన సముదాయం వద్దకు వెళ్లి నిర్మాణ పనులను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన భవన నిర్మాణం పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులతో తెలుసుకున్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయం వెంటనే నిర్మాణం పూర్తి చేయడంతో పాటు రోడ్లు, ఇతర పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మూడు నెలల్లోగా పనులన్నీ పూర్తిచేయాలన్నారు. అయితే ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌ భవన సముదాయం వరకు మొర్రం మట్టి చదును చేయాల్సి ఉందని ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ కలెక్టర్‌కు తెలిపారు. కాగా, కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌ జైన్‌ను అదనపు కలెక్టర్‌ ఫణీందర్‌రెడ్డి, ట్రెయినీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏఓ శ్రీధర్‌తో పాటు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి..

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు ప్రాధాన్యతనిస్తూ.. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి.. పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement