నారాయణపేట: నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ.. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే 1.90 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఉద్యోగ నియామకాలపై కన్నెత్తి చూడటం లేదన్నారు. మరోవైపు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ప్రభుత్వం ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు కూడా కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రభుత్వాలకు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని, లేనిపక్షంలో ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిద్దూ, మధు, రవి, కృష్ణ, శివ, గణేశ్, మల్లేష్ ఉన్నారు.


