ర్యాలంపాడుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ర్యాలంపాడుకు మోక్షం

Mar 11 2026 8:34 AM | Updated on Mar 11 2026 8:34 AM

ఎట్టకేలకు నిధులు..

ర్యాలంపాడు రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయడానికి ప్రభుత్వం రూ. 4.92 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.1.66 కోట్లు సీడబ్ల్యూపీఆర్‌సీ పుణెకు, మిగిలిన రూ. 3.66 కోట్లతో రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని నిర్ణయించారు. అయితే రిజర్వాయర్‌ ఆనకట్టలోని రాక్‌టోల్‌ లేయర్ల మట్టి నమూనాలు, తూముల అడుగు భాగంలోని నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌సీకి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టనున్నారు.

గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం అంతర్భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు నాలుగేళ్ల క్రితం లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా 4 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న రిజర్వాయర్‌లో 2 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తూ.. 1.12 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానాకాలంలో ఒక పంటకు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. యాసంగి సీజన్‌లో రెండో పంటకు సాగునీరు అందించకుండా క్రాప్‌హాలిడే ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో ర్యాలంపాడు రిజర్వాయర్‌కు మరమ్మతు చేయాలని రైతులు ప్రతి ఏడాది ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు హైదరాబాద్‌, పుణె నుంచి ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రిజర్వాయర్‌ను సందర్శించి.. సర్వే చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఎట్టకేలకు ర్యాలంపాడు రిజర్వాయర్‌ మరమ్మతుకు మోక్షం లభించింది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి మరమ్మతు కోసం ప్రభు త్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది.

రెండేళ్లకే లీకేజీలు..

గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల ప్రజలకు తాగునీటితో పాటు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 2005లో శంకుస్థాపన చేశారు. 2009 వరకు పరుగులు పెట్టిన ప్రాజెక్టు నిర్మాణ పనులు.. వైఎస్సార్‌ అకాలమరణంతో అసంపూర్తిగా నిలిచాయి. నెట్టెంపాడు ప్రాజెక్టులో మొత్తం 20 టీఎంసీల సామర్థ్యంతో ఏడు రిజర్వాయర్లు ఉండగా.. ర్యాలంపాడు రిజర్వాయర్‌ను 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణంపై అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోవడం.. గుత్తేదారు లోపభూయిష్ట నిర్మాణంతో రిజర్వాయర్‌ అందుబాటులోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే ఆనకట్ట, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి.

రిజర్వాయర్‌ మరమ్మతుకు రూ. 4.92 కోట్లు మంజూరు

సివిల్‌ గ్రౌంటింగ్‌ పరీక్షలకు

రూ. 1.66కోట్లు కేటాయింపు

రూ. 3.66కోట్లతో జలాశయం ఆనకట్ట, తూముల మరమ్మతు

త్వరలోనే ప్రారంభంకానున్న పనులు

త్వరలోనే పనులు..

ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీలకు మరమ్మతు కోసం ప్రభు త్వం రూ. 4.92కోట్లు మంజూరు చేసింది. పుణె నుంచి వచ్చే తుదినివేదిక ఆధారంగా త్వరలోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపట్టి.. పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం.

– రహీముద్దీన్‌, ఎస్‌ఈ, ఇరిగేషన్‌ శాఖ

పలుమార్లు సర్వే..

ర్యాలంపాడు రిజర్వాయర్‌ లీకేజీలకు మరమ్మతు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా రూ. 60లక్షలతో హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీకి సర్వే పనులను అప్పగించింది. ఆరునెలల పాటు సర్వే చేసిన సదరు ఏజెన్సీ.. మరమ్మతుకు సంబంధించిన తుది నివేదికను గత ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మరోసారి పుణెకు చెందిన ఇంజినీరింగ్‌ బృందంతో సర్వే చేయించింది. ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రెండుసార్లు రిజర్వాయర్‌ను సందర్శించారు. సర్వేకు సంబంధించిన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement