సకాలంలో ఇళ్ల
నిర్మాణం పూర్తికావాలి..
● అదనపు కలెక్టర్ ఫణీంధర్‌రెడ్డి
నారాయణపేట: జిల్లాలోని సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు ఈ నెల 12న నిర్వహించే ఒకరోజు శిక్షణకు జిల్లాకేంద్రంలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌ను సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీ, వీఐపీ, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందేలా తగిన జాగ్రత్తలు పాటించినట్లు వివరించారు. శిక్షణకు వచ్చే ప్రతి ఒక్కరికి ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించామని, ఆడియో, వీడియో వ్యవస్థ సరిగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ఉదయం విడతలో ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యాచరణ, 10 థీమ్స్‌లో వివిధ శాఖలు చేపట్టే పనులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంపై అవగాహన కల్పిస్తామని.. మధ్యాహ్న భోజనం అనంతరం పీఆర్, మున్సిపల్ చట్టంపై తరగతులు ఉంటాయని వివరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఎస్పీ లింగయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దామరగిద్ద: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించి బిల్లుల చెల్లింపులో చొరవ తీసుకుంటూ సకాలంలో పూర్తి చేయించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. మండలంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.. ఏయే దశల్లో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయని ఆరా తీశారు. సకాలంలో బిల్లులు అందించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ సాయిలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి తిరుపతిరెడ్డి ఉన్నారు.


