నారాయణపేట: విద్యతోనే మహిళల అభ్యున్నతి, సాధికారిత సాధ్యమని.. మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సరైన అవకాశాలు కల్పిస్తే అతివలు సమర్థవంతంగా అనుకున్నది సాధిస్తారని.. సమాజంలో మహిళలకు పురుషులతో సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. మహిళల భద్రత, ఉపాధి అవకాశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబంలో మగ, ఆడ పిల్లలను సమాన దృష్టితోనే చూడాలని సూచించారు. మహిళలు తమకు ఉన్న హక్కులు, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుర చైర్‌పర్సన్ కొండా శ్వేతా సత్యయాదవ్ మాట్లాడుతూ.. మహిళలు ఎంచుకున్న ప్రతి రంగంలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. మక్తల్ చైర్‌పర్సన్ వాకిటి మానస మాట్లాడుతూ.. సృష్టికి మూలం సీ్త్ర అన్నారు. ఇటీవల జరిగిన పుర ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలిచిన తనకు మంత్రి వాకిటి శ్రీహరి చైర్‌పర్సన్ అవకాశం ఇచ్చారని తెలిపారు. చెల్లి, తల్లి, భార్య, కోడలిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే మహిళలు ఏ రంగంలోనైనా రాణిస్తారనే నమ్మకం తనకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో భర్త, పిల్లలు అని కాకుండా ఉమ్మడి కుటుంబానికి మహిళలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ ఫణీందర్‌రెడ్డి, డీఆర్డీఓ మొగులప్ప, ఆర్టీఓ మేఘాగాంధీని డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్ ఘనంగా సత్కరించారు. అలాగే జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణకు కృషిచేసిన ఐసీడీఎస్ నారాయణపేట, మక్తల్ ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీఓలు, ఏసీడీపీఓలు, సూపర్‌వైజర్లు, ఉద్యోగులు, సిబ్బంది, కేర్‌టేకర్లు, పోలీసులను శాలువా, మెమెంటోతో సన్మానించారు. వీరితోపాటు నారాయణపేట, మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, వార్డు కౌన్సిలర్లను సన్మానించారు. సీడబ్ల్యూసీ అశోక్‌కుమార్, వైస్ చైర్‌పర్సన్ మంజుల, కౌన్సిలర్లు కందన్‌పల్లి సత్యమ్మ, జయశ్రీ, భాగ్యవతి, అరుణ, బండి రాజేశ్వరి, కల్పన రఘురామయ్య, శ్వేత వెంకటేష్ పాల్గొన్నారు.


