మున్సి‘పోల్స్’కు రెడీ
● జిల్లాలో 71 వార్డులకు ఎన్నికలు
● 149 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, మద్దూర్, కోస్గి మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు గాను 71 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా వార్డుల్లో 149 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి.. 181 మంది పీఓలు, 181 మంది ఏపీఓలు, 538 మంది ఓపీఓలను నియమించారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా.. అధికారులు, సిబ్బంది మంగళవారమే ఎన్నికల సామగ్రితో ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ డా.వినీత్ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నారాయణపేటలో 35,460, కోస్గిలో 20,248, మక్తల్‌లో 23,345, మద్దూర్‌లో 12,701 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోనున్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు : కలెక్టర్
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని గు రుకుల బాలికల పాఠశాల/కళాశాలలో ఏర్పాటుచే సిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎ లాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలన్నారు. చెక్‌లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిందా.. లేదా అనేది జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడి న బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్‌ఓ, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ హాళ్లను సైతం కలెక్టర్ పరిశీలించారు. స్ట్రాంగ్‌రూంలు, కౌంటింగ్ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ వెంట స్పెషల్ ఆఫీసర్ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య ఉన్నారు.
నేడు సాధారణ సెలవు
నారాయణపేట: సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు పోలింగ్ రోజున ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకొని.. ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.


