బెస్ట్ ‘అన్’ అవైలబుల్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఆర్థికంగా వెనకబడిన ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన ప్రైవేటు విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం బెస్టు అవైలబుల్ స్కీం (బీఏఎస్) ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం 1 నుంచి 5వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తూ.. 10వ తరగతి వరకు విద్యార్థులకు ఉచితంగా విద్యను ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో అందిస్తుంది. రెసిడెన్షియల్ పద్ధతి లేదా డే స్కాలర్ విధానంలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో మొత్తం 50 పాఠశాలల్లో మొత్తం 3,380 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.46 వేల వరకు ఖర్చు చేస్తుంది. 1 నుంచి 5 తరగతుల వరకు చదివే డే స్కాలర్స్‌కు పాఠశాల చదువుతో పాటు పుస్తకాలు, షూ, నోటుబుక్స్ ఇవ్వాలి. 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి హాస్టల్ వసతి కల్పించాల్సి ఉంటుంది. అయితే గడిచిన మూడేళ్లుగా వీటికి సంబంధించిన ఫీజులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరసన చేపట్టగా.. బకాయిల్లో 25 శాతం నిధులు విడుదల చేసింది.
అవగాహన లేకపోవడంతో..
బీఏఎస్ ద్వారా ఎన్నికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఎలా చెబితే అలా ఫీజులు చెల్లిస్తున్నారు. నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, హాస్టల్, పాఠశాల, షూ, అడ్మిషన్ ఫీజు ఇలా అన్నీ ఉచితంగా అందించాల్సి ఉంది. కానీ, నిధులు ప్రభుత్వం విడుదల చేయలేదన్న సాకు చూపి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అనేక పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దఎత్తున ఫీజులు వసూలు చేశారు. ముఖ్యంగా చాలా వాటిలో కేవలం పాఠశాలలను నిర్వవహించేందుకు మాత్రమే అనుమతులు ఉండగా, వాటిలోనే హాస్టల్స్ సైతం కొనసాగిస్తున్నారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులకు మూడు పూటలా పెట్టాల్సిన భోజనంలోనూ నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వీటిని ఏమాత్రం పట్టించుకోని సంక్షేమ శాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో నీరుగారుతున్న పథకం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నామమాత్రంగానే ప్రైవేటు విద్య వసతి
తల్లిదండ్రుల నుంచే పుస్తకాలు, హాస్టళ్లకు డబ్బులు వసూలు
అయినప్పటికీ అరకొర వసతులు, నాణ్యత లేని భోజనం వడ్డింపు
మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం.. పట్టించుకోని అధికారులు


