ముగిసిన జిల్లాస్థాయి పరుగు పందెం పోటీలు
నారాయణపేట టౌన్: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పరుగు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్సై వెంకటేశ్వర్లు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని తెలిపారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించగా.. అండర్–14 విభాగాల్లో రవితేజ, తేజశ్విని, అండర్–16లో శివ, పల్లవి, అండర్–18లో నరేష్, అలేఖ్య, అండర్–20లో గణేష్, మహేష్ విజేతలకు రూ.వెయ్యి నగదుతో పాటు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యుడు తిప్పన్న, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ హారికాదేవి, క్రికెట్ కోచ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.


