ఐక్యతకే రన్ ఫర్ యూనిటీ
నారాయణపేట: భారతదేశమంతా ఏకీకృతంగా ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సుమారు 560కి పైగా సంస్థానాలను విలీనం చేశారని కలెక్టర్ సిక్తాపట్నాయక్ తెలిపారు. శనివారం జాతీయ ఐక్యత దినోత్సవం, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపును పురస్కరించుకొని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జాతీయ సమైఖ్యత ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఎస్పీ డా. వినీత్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్ మీదుగా ఎస్పీ కార్యాలయం వరకు యువత, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, భద్రత, ఐక్యమత్యాన్ని చాటడంలో యువత ముందుండాలని, చెడుకు దూరంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వినీత్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల ముగింపు, జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహించామన్నారు. పటేల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ యువత, పౌరులు సన్మార్గంలో నడవాలని, దృఢమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్, ఆర్‌ఐ నర్సింహ, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాముడు, రాజు, నరేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.


