ఇంటర్ సప్లిమెంటరీలో 65శాతం ఉత్తీర్ణత
నారాయణపేట రూరల్/ నారాయణపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 65శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 2,283 మంది పరీక్షలకు హాజరుకాగా.. 1,318 మంది (57.73శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 125 మందికి గాను 98 మంది (78.4శాతం) ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,316 మందికి గాను 652మంది (49.54శాతం), ఒకేషనల్‌లో 63 మందికి గాను 40మంది (63శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా, విద్యార్థులు రీకౌంటింగ్ కోసం రూ.100, రీవెరిఫికేషన్ కోసం రూ.600 చెల్లించి ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ సుదర్శన్‌రావు తెలిపారు.
బాధితులకు భరోసానివ్వాలి: డీఎస్పీ
నారాయణపేట: వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలని డీఎస్పీ నల్లపు లింగయ్య పోలీసు అధికారులకు సూచించారు. డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఎస్పీ ఆదేశించారు.
హక్కుల సాధన కోసం పోరాడుదాం
నారాయణపేట: కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని.. వాటిని కాపాడుకోవడానికి కార్మిక వర్గం నిరంతర పోరాటానికి సిద్ధం కావాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.సూర్యం పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ భవన్‌లో జరిగిన టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభల ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా విభజించి అన్యాయం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తోడుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని, అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామని, మధ్యాహ్నం భోజన కార్మికులకు భద్రత కల్పిస్తామని, మిషన్ భగీరథ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, పీఫ్, ఈఎస్‌ఐ అమలు చేస్తామని, అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూర్చే జీఓలు అమలుచేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చుకోవడం లేదన్నారు. కార్మికుల హక్కుల కోసం రాజీ లేని లేని పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎం. కాళేశ్వర్, టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్.కిరణ్, ప్రధాన కార్యదర్శి బి.నర్సింహ, ఉపాధ్యక్షుడు ఏజి బుట్టో, బోయిన్‌పల్లి రాము, సహాయ కార్యదర్శి ఎదిరింటి నర్సింహ, రామాంజనేయులు కోశాధికారి కొలిమి రాములు, కాశీనాథ్ ఉన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీలో 65శాతం ఉత్తీర్ణత


