
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా అందులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఏప్రిల్ నెలలోనే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత రెండో దశలో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అమలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా రిజిస్ట్రార్ రవీందర్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ సేవలు పరిశీలించి కొనుగోలుదారులకు దస్తావేజులు అందజేశారు.
మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు
ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలకు పారదర్శకంగా, మరింత వేగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఇందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, వనపర్తి, గద్వాల కార్యాలయాలకు ఒక్కొక్కరు చొప్పున సబ్ రిజిస్ట్రార్లను కేటాయించారు. ఈ మేరకు సోమవారం జడ్చర్లలో నూతన సబ్ రిజిస్ట్రార్ భానుప్రసాద్ బాధ్యతలు సైతం స్వీకరించారు.
అవగాహన లేకపోవడంతో..
సోమవారం స్లాట్ బుకింగ్ సేవలు ప్రారంభమైన కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని కార్యాలయాల్లో సాఫీగానే సాగగా.. మరికొన్ని కార్యాలయాల్లో ప్రజలకు స్లాట్ బుకింగ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అలంపూర్‌లో ఒక్క స్లాట్ కూడా బుక్ కాలేదు. ఆత్మకూర్‌లో కేవలం 1 దస్తావేజు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యింది. గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 44 స్లాట్ బుకింగ్ చేసుకోగా 35 దస్తావేజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కాగా.. మిగతా 9 దస్తావేజుల అమ్మకపు, కొనుగోలుదారులు కార్యాలయానికే రాలేదు. సోమవారం స్లాట్ బుకింగ్ ప్రారంభమైన కార్యాలయాల్లో జడ్చర్లలో 40, వనపర్తిలో 45, గద్వాలలో 35, మక్తల్‌లో 7, అచ్చంపేటలో 5, కొల్లాపూర్‌లో 7, ఆత్మకూరులో ఒక స్లాట్ బుక్ అయ్యాయి.
ఉమ్మడి జిల్లాలోని 12 చోట్ల పూర్తిస్థాయిలో అమలు
తొలిరోజు 140 స్లాట్స్ బుకింగ్
జిల్లాకు ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల కేటాయింపు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు