
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
నారాయణపేట రూరల్: ప్రతి ఉద్యోగి జీవితంలో వచ్చే పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్‌కుమార్‌గౌడ్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందడంతో మంగళవారం తన కార్యాలయంలో భుజంపై పట్టీలు తొడిగి మాట్లాడారు. పోలీసుశాఖలో పదోన్నతి కత్తిమీద సాములాంటిదని, ఆనందంతో పాటు బాధ్యత సైతం రెట్టింపు అవుతుందన్నారు. విధి నిర్వహణలో ధైర్యం, సాహసం కలిగి ఉండాలని, సమయపాలన పాటించాలని, గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు నర్సింహ, ఆనంద్ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట రూరల్: జిల్లాలోని కార్మికులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ఈ–శ్రామ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ అధికారి మహేశ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. కొరియర్, హోం సర్వీసెస్, ఫుడ్ డెలివరీ, ఏసీ టెక్నీషియన్స్, గ్రాఫిక్స్ డిజైనర్, వీడియో ఎడిటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ సంస్థల్లో పనిచేసే వారిని సైతం కార్మికులుగా గుర్తించారని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకానికి..
మరికల్: జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జోనల్ అధికారి ఫ్లోరెన్స్‌రాణి తెలిపారు. మంగళవారం పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలని.. ఈ నెల 30న పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు డెమో క్లాస్ నిర్వహిస్తామని వివరించారు. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.