
యోగాతో మానసిక ప్రశాంతత
నారాయణపేట రూరల్: ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే వత్తిడిని అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని అర్బన్ హెల్త్ సెంటర్ ఆవరణలో ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యసిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 198 దేశాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. నిత్య జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయని.. వాటన్నింటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండటానికి యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. రోజు ఉదయం 7 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రిలో యోగా తరగతులు నిర్వహిస్తున్నామని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డా. నరసింహారావు, డీపీఓ భిక్షపతి, యోగా ఇన్‌చార్జ్ నర్సింహులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.