
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
మద్దూరు: ఉమ్మడి మద్దూరు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం మండలంలో ఎస్‌డీఎఫ్ నిధులతో కొనసాగుతున్న నారాయణపేట మండలం బండగొండ నుంచి చెన్వార్ వరకు బీటీ పనులు, బండగొండ నుంచి మోమినాపూర్ వరకు బీటీ రోడ్డుతో పాటు హైలేవల్ వంతెన నిర్మాణం, మోమినాపూర్ నుంచి గనిమోనిబండ, అభంగాపూర్, అప్పిరెడ్డిపల్లి నుంచి రెనివట్ల, రాళ్లబాయి వరకు కొనసాగుతున్న బీటీ పనులు, మోమినాపూర్ నుంచి రెనివట్ల వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను తనిఖీ చేశారు. పనులను నాణ్యతగా నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈ హీర్యానాయక్, డిప్యూటీ విలోక్‌ను ఆదేశించారు. కొత్త బీటీ పనులతో పాటు రెన్యూవల్ పనులు ప్రారంభించి వెంటనే పూర్తి చేయించాలన్నారు.
భవన నిర్మాణ పనుల పరిశీలన..
కొత్తపల్లి మండలం భూనీడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.6 కోట్లతో నిర్మించే ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. తరగతులు పునః ప్రారంభమైతే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని.. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మద్దూరులో రూ.30 కోట్లతో చేపట్టే సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వర్షాలు కురుస్తున్నందున మట్టి పరీక్షలు చేపట్టలేకపోయామని కాంట్రాక్టర్ వివరించారు. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. రవాణాలో జాప్యం జరుగుతుందని తెలిపారు. తహసీల్దార్‌తో మాట్లాడి ఇసుక ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతిపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భూ భారతి ప్రత్యేక అధికారి యాదగిరి, తహసీల్దార్లు మహేష్‌గౌడ్, శ్రీనివాస్, జయరాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.